Zelensky In Kyiv : జెలెన్‌స్కీ పారిపోలేదు, కీవ్‌లోనే ఉన్నారు- యుక్రెయిన్ ప్రకటన
జెలెన్‌స్కీ(Zelensky In Kyiv) ఎక్కడికీ వెళ్లలేదని, కీవ్‌లోనే ఉన్నారని యుక్రెయిన్ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

Zelensky In Kyiv
Zelensky In Kyiv : రష్యా భీకర యుద్ధం నేపథ్యంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశం విడిచి వెళ్లిపోయారని, పోలాండ్ లో తలదాచుకున్నారన్న రష్యా మీడియా కథనాలు కలకలం రేపాయి. దీనిపై యుక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. ఆ కథనాలను తోసిపుచ్చింది. జెలెన్‌స్కీ ఎక్కడికీ వెళ్లలేదని, కీవ్‌లోనే ఉన్నారని యుక్రెయిన్ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై(Zelensky In Kyiv) రష్యా మీడియా సంచలన కథనాన్ని వెలువరించింది. జెలెన్ స్కీ ప్రస్తుతం యుక్రెయిన్‌లో లేరని, పోలాండ్ వెళ్లిపోయారని రష్యా మీడియా చెప్పింది. జెలెన్‌స్కీ దేశం విడిచి వెళ్లిపోయారని, పోలాండ్‌లో తలదాచుకున్నారని కథనాలు రాసింది.
Stinger Missile : పవర్‌ఫుల్ స్టింగర్.. యుక్రెయిన్ చేతికి అమెరికా బ్రహ్మాస్త్రం
ఈ రకమైన కథనాలను రష్యా మీడియా ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలానే చేసింది. యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే జెలెన్ స్కీ భయపడి విదేశాలకు పారిపోయారని రష్యా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. రష్యా చెప్పేదంతా అబద్దమే అన్నారు. తాను ఎక్కడికీ పోలేదని, యుక్రెయిన్ లోనే ఉన్నానని చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. చివరి రోజు వరకూ తాను యుక్రెయిన్‌లోనే ఉంటానని, ప్రస్తుతం యుక్రెయిన్‌లోనే ఉన్నానని ఆ వీడియోలో స్పష్టం చేశారు. రష్యా సేనలను ధైర్యంగా ఎదుర్కొంటామని, వారితో పోరాడతామని జెలెన్ స్కీ తేల్చి చెప్పారు.
యుద్ధ సమయంలో జెలెన్ స్కీ యుక్రెయిన్ సైన్యం వెన్నంటి నిలిచారు. స్వయంగా రంగంలోకి దిగి సైనికుల్లో ధైర్యం నూరిపోశారు. దేశాన్ని కాపాడుకునేందుకు యుద్ధ రంగంలోకి దిగేందుకు ఆసక్తి కలిగిన సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తే.. ఆయుధాలు ఇస్తామని కూడా ప్రకటించి
సంచలనం రేపారు జెలెన్ స్కీ. అంతేకాకుండా తమ దేశం రష్యా గుప్పిట్లోకి వెళ్లకుండా ఉండే దిశగా శక్తివంచన లేకుండా ఆయన వ్యూహాలు రచించారు. జెలెన్ స్కీ వ్యూహాల కారణంగానే యుక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్దతుతో పాటు రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగింది.
రష్యా- యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా సేనలు యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన జపోరిజియాపై రష్యా సేనలు దాడులకు దిగాయి. ఈ దాడిలో జపోరిజియా ప్లాంట్ ప్రమాదానికి గురైంది. ఫైరింగ్ వల్ల ఆ ప్లాంట్‌లో మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ మంటలను ఫైర్‌ఫైటర్స్ ఆపినట్లు శుక్రవారం తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్‌లో ఉన్న పవర్ యూనిట్లను అక్కడే ఉన్న సిబ్బంది మానిటర్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్లాంట్ దాడిలో రియాక్టర్ నెంబర్ వన్‌లో స్వల్పంగా డ్యామేజ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఒకవేళ ఆ అణు కేంద్రం పేలి ఉంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించడమే కష్టం అన్న అభిప్రాయం వ్యక్తమైంది. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ యూరోప్‌లోనే పెద్ద అణు విద్యుత్తు కేంద్రం. ఆ ప్లాంట్‌లో మొత్తం ఆరు రియాక్టర్లు ఉన్నాయి. ఒకవేళ ఆ ప్లాంట్‌లో పేలుడు జరిగి ఉంటే, దాని
ప్రభావం చెర్నోబిల్ ఘటన కన్నా పది రెట్లు ఎక్కువగా ఉండేదని యుక్రెయిన్ విదేశాంగ మత్రి డిమిట్రో కులేబా తెలిపారు.
రష్యా సేనలకు దీటుగా బదులిస్తున్నామని యుక్రెయిన్ సాయుధ బలగాలు స్పష్టం చేశాయి. ఇప్పటివరకూ 250 రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశామని, 10వేల మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది.