‘పోరాడకుండా వెనక్కు తగ్గేదే లేదు’.. రెస్ట్ మోడ్‌లో గేల్ కీలక వ్యాఖ్యలు

యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ Chris Gayle ఐపీఎల్ (IPL) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు వరుస ఓటములు ఎదురవుతున్నా గేల్ లాంటి బ్యాట్స్‌మన్ ఇంకా క్రీజులోకి అడుగుపెట్టడం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఆడతాడని భావించగా అందరికీ నిరుత్సాహమే ఎదురైంది.
పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే.. ఫుడ్ పాయిజనింగ్ కావడంతో చివరి నిమిషంలో అతణ్ని తీసుకోలేకపోయామంటూ చెప్పుకొచ్చాడు. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ యూనివర్సల్ బాస్ ఆడనేలేదు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లనే ఆడించలేదని సమాచారం.
తాజాగా గేల్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను విడుదల చేశాడు. చేతిలో గ్లాస్, కళ్లపై కీరదోశ, నోట్లో క్యారెట్ ముక్క పెట్టుకుని ఆసుపత్రి బెడ్‌పై సేదదీరుతూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టున్న ఫొటోలో ఉంది. దానికి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
‘ఓ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ పోరాడకుండా వెనుదిరగను. ఎందుకంటే.. నేను యూనివర్సల్ బాస్‌ను. అది ఎప్పటికీ మారదు!!. నా నుంచి అన్నిసార్లూ కాకున్నా కొన్నిసార్లు నేర్చుకోవచ్చు. నా స్టైల్‌ను, ఫైటింగ్ కెపాసిటీని మరచిపోకండి. నేను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని గేల్ తెలిపాడు.
ఈ సీజన్‌లో పంజాబ్ దారుణంగా విఫలమవుతోంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. కోల్‌కతా నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ ఛేదనలో గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమికి గురైంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ అన్ని మ్యాచుల్లోనూ గేల్‌ను పక్కనపెట్టింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను పక్కకుపెట్టి ఆ స్థానంలో గేల్‌ను ఆడించాలనే ఒత్తిడి ఎక్కువవుతోంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క విజయంతోనే కొనసాగుతోంది. దీంతో 2 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవకపోతే ప్లేఆఫ్స్‌కు చేరడం అనుమానమే. మెరుగైన రన్‌రేట్‌తో విజయాలు సాధిస్తేనే అది సాధ్యపడుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా పంజాబ్ రిటర్న్ జర్నీకి రెడీ అవ్వాల్సిందే.