రైతుల డిమాండ్లకు BSNL ఉద్యోగుల మద్దతు…భారత్ బంద్ కు సర్వ సన్నద్ధం

BSNL employees come out in support of farmers’ demands నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని 12 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. కాగా,ఆందోళన చేస్తున్న రైతులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా రైతు సంఘాల డిమాండ్లకు BSNL ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు తెలిపింది.
అప్రజాస్వామికంగా గత పార్లమెంట్ సెషన్ లో పాస్ చేసిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ కు పూర్తి మద్దతును ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్(BSNLEU)సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళవారం భారత్ బంద్ నేపథ్యంలో భోజన విరామ గంటలో నిరసనలు తెలపాలని దేశవ్యాప్తంగా తమ సర్కిల్ మరియు జిల్లా శాఖలకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. రైతన్నల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు అన్నదాతలకు తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్
మంగళవారం జరగనున్న భారత్ బంద్ కు రైతు సంఘాలు సర్వ సన్నద్ధమయ్యాయి. సాగు చట్టాలపై వ్యతిరేకతను, తమ ఐక్యతను ప్రదర్శించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. డిసెంబర్ 8 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చారు. మరోవైపు భారత్ బంద్‌కు విపక్షాల నుంచి మద్దతు లభించింది. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు 20 రాజకీయ పార్టీలు, 35 విద్యార్థి సంఘాలు, 5 కార్మిక సంఘాలు, 50 ట్రాన్స్ ఫోర్ట్ సంఘాల మద్దతు పలికాయి. రైతులకు టీఎంసీ సంఘీభావం ప్రకటించినప్పటికీ.. బంగాల్లో మాత్రం భారత్ బంద్ కు మద్దతివ్వడం లేదని వెల్లడించింది.
కాగా,తమ ఆందోళనల్లో రాజకీయాలకు తావు లేదని.. రాజకీయ నేతలకు తమ వేదికలపై అనుమతి లేదని స్పష్టం చేశారు రైతు సంఘాల నేత డా. దర్శన్ పాల్. మంగళవారం మొత్తం బంద్ పాటిస్తామని.. అయితే రోడ్డు దిగ్బంధం వంటి నిరసనలు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకే జరుగుతాయని వెల్లడించారు. భారత్ బంద్‌ను శాంతియుతంగానే చేపట్టాలని తాము నిశ్చయించుకున్నట్టు స్పష్టం చేశారు.
భారత్ బంద్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. కరోనా నిబంధనలను కూడా కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.