పిల్లి నాకడంతో మహిళ మృతి

పిల్లులు, కుక్కలు పెంపుడు జంతువులు. సాధారణంగా ప్రతి ఒక్కరు పిల్లులు, కుక్కులను పెంచుకుంటారు. అవి యజమానులతో సయ్యాటలాడుతుంటాయి. యజమానుల మీద ప్రేమతో అవి నాలుకతో నాకుతుంటాయి. కానీ ఓ మహిళ తను పెంచుకునే పిల్లి నాకడం వల్ల మరణించింది.
80 ఏళ్లు పైబడిన బామ్మ మింటీ అనే పిల్లిని పెంచుకుంటుంది. అదంటే ఆమెకు ప్రాణం. మింటీకి కూడా ఆ బామ్మ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పాపం పిల్లి బామ్మ చేతిని గీకింది. బామ్మ చేతికి గాయం కావడంతో అయ్యో.. అంటూ పిల్లి నాలుకతో నాకింది. దీంతో బామ్మ కొన్ని రోజులకే అస్వస్థకు గురైంది.
వెంటనే ఆస్పత్రికి తరలించడంతో అసలు విషయం బయట పడింది. జంతువుల లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుంది. గాయం మీద పిల్లి నాకడంతో ఆ బ్యాక్టీరియా డైరెక్టుగా రక్తంలోకి చేరి అక్కడ నుంచి మెదడుకి చేరింది.
దీంతో ఆమె కోమాలోకి పోయి మృతి చెందింది. అందుకే పెంపుడు జంతువులు పెంచుకునేవారు గాయాలు తగిలినప్పుడు వాటికి దూరంగా ఉండడం మంచిదని వైద్యులు అంటున్నారు.