ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్, సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్, సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

Updated On : February 24, 2021 / 6:37 PM IST

cbse syllabus in ap government schools: ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, ‘నాడు-నేడు’ పనులు, విద్యాకానుకపై ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి 1-7 తరగతులకు సీబీఎస్‌ఈసీ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. విద్యాకానుకలో ఇంగ్లీష్‌, తెలుగు డిక్షనరీలను చేర్చాలని.. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకూ డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల నాణ్యత, సర్వీసు బాగుండాలన్నారు.

తొలి విడత నాడు-నేడు పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడెక్కడ పనులు పెండింగ్‌లో ఉన్నాయనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వాటిని పూర్తిచేయాలన్నారు.

మొత్తంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు సీఎం జగన్. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మార్చేస్తున్న సీఎం జగన్.. మరో విప్లవాత్మక అడుగు వేశారని చెప్పాలి.