టీకా రూల్స్ : ఎన్నికల ఓటర్ లిస్టు ఆధారంగా..వ్యాక్సిన్

Covid-19 Vaccination Based on Voters’ List : దేశమంతా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కరోనా టీకాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆపరేషనల్ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఒక వ్యాక్సినేషన్ సైట్‌లో ఒక సెషన్‌లో 100 మంది లాభార్థులకు టీకా ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్ సైట్‌లో వెయిటింగ్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్ తదితర వసతులుంటే 200 మందికి ఇవ్వవచ్చని తెలిపింది. ఒక వ్యాక్సినేషన్ టీమ్‌లో 5 గురు సభ్యులుంటారు. వ్యాక్సినేటర్ ఆఫీసర్‌గా డాక్టర్, నర్స్, ఫార్మాసిస్ట్… దస్తావేజుల పర్యవేక్షణకు ఓ అధికారి, ఇద్దరు సహాయ సిబ్బంది ఉంటారు.
ఫేజ్-వన్ ప్లానింగ్‌లో మొత్తం 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నారు. అందరికన్నా ముందు కోటి మంది హెల్త్‌కేర్ వర్కర్స్, 2 కోట్ల ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు 50 ఏళ్ల వయసు పైబడ్డ 26 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. ఎన్నికల వోటర్ లిస్ట్ ఆధారంగా 50 ఏళ్ల పైబడ్డ వారిని గుర్తించనున్నారు. కో-విన్ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కరోనా వ్యాక్సినేషన్ లాభార్థుల ఎంపిక జరుగుతుంది. తొలిప్రాధాన్యం ఆధారంగా పేర్లు రిజిస్టర్డ్ అయినవారికే టీకా వేస్తారు.
సెషన్ల ప్రకారం వ్యాక్సినేషన్ ప్లానింగ్ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. టీకా పొందిన ప్రతి వ్యక్తిని 30 నిమిషాల పాటు పర్యవేక్షిస్తారు. టీకా వేసిన తర్వాత రియాక్షన్ అయితే వెంటనే విచారణ జరపాలని స్పష్టం చేసింది.