Cyclone Tauktae: అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలంగాణకు అలెర్ట్!

అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అంతేకాదు ఇది ఈ నెల 16 నాటికి తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Cyclone Tauktae: అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలంగాణకు అలెర్ట్!

Cyclone Tauktae

Updated On : May 14, 2021 / 11:21 AM IST

Cyclone Tauktae: అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అంతేకాదు ఇది ఈ నెల 16 నాటికి తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ తుఫాన్ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.

ముఖ్యంగా ఈ తుపాను ప్రభావం ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉంటుందని హైదరాబాద్​ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నమోదైన వాతావరణాన్ని తీసుకుంటే అత్యధికంగా ధర్మపురి సమీపంలోని బుద్దేశ్‌పల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. పలు ప్రాంతాల్లో 40 -43 డిగ్రీలుంది.

అయితే, ఇదే సమయంలో గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 107 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి జిల్లా నాగుపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా అత్యల్పంగా షాబాద్‌(రంగారెడ్డి)లో 2.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ గాలుల్లో అస్థిరత ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గాలులతో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.