Today Headlines: మేనల్లుడి కోసం.. హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్

ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు వైఎస్ షర్మిల.

Today Headlines: మేనల్లుడి కోసం.. హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్

Updated On : January 17, 2024 / 10:03 PM IST

మేనల్లుడి కోసం.. హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్
మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ రేపు హైదరాబాద్ కు వెళ్లనున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు. ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు వైఎస్ షర్మిల.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి బ్రేక్
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి బ్రేక్ పడింది. ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలకు సంబంధించి గతంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు.

నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిని
ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిని అని చెప్పారు. పార్టీ కోసం సహనంగా ఉంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. తన పట్ల కేంద్ర, రాష్ట్ర అధినాయకత్వం సానుకూలంగా ఉందన్న అద్దంకి దయాకర్.. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోందని భావిస్తున్నాను అని అన్నారు.

చంద్రబాబు పట్టుబడిన దొంగ, చట్టం నుంచి తప్పించుకోలేరు- అంబటి రాంబాబు
చంద్రబాబు నాయుడు పట్టుబడిన దొంగ అని, ఆయన చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తప్పు చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు లాయర్లు చేసిన వాదనలను ఏసీబీ కోర్టు, హైకోర్టు కొట్టివేసిందని.. సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు అంబటి. చంద్రబాబును నిర్దోషిగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో ఖరీదైన లాయర్లు వాదించినా చెల్లుబాటు కాలేదని విమర్శించారు.

విమానాలకు పొగమంచు కష్టాలు.. నిలిచిపోతున్న సర్వీసులు
గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ల్యాండ్ అయ్యే సమయంలో కానీ టేకాఫ్ అయ్యే సమయంలో కానీ పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తిప్పలు పడుతున్నారు.

వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు- హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీమంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించి బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కానీ, వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని హరీశ్ రావు అన్నారు. ఇంకా 100 రోజులు కాలేదనే ఆగుతున్నామన్న హరీశ్ రావు.. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లం అంటూ విరుచుకుపడ్డారు.

పబ్‌లో కస్టమర్లపై బౌన్సర్లు, డీజే ఆపరేటర్ల దాడి
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. కస్టమర్లపై బౌనర్లు, డీజే ఆపరేటర్లు దాడి చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదైంది. పబ్ నిర్వాహకుడితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ప్రజాభవన్‌ ముందు రోడ్డు ప్రమాద కేసులో కీలక మలుపు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ ముందు జరిగిన రోడ్డు ప్రమాద కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో జోడించారు అధికారులు. రహీల్‌ దుబాయ్‌ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా గుర్తించారు. రహీల్‌కు సాయం చేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దావోస్‌లో సీఎం రేవంత్.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదాని గ్రూప్, ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ ముందుకు వచ్చాయి. తెలంగాణలో పలు రంగాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదాని గ్రూప్ నిర్ణయించింది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ఈ మేరకు వెల్లడించారు. మల్లాపూర్‌లో డ్రగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్ విస్తరణకు రూ. 2 వేల కోట్ల పెట్టుబడి పెడతామని, 1500 కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది.

కాంగ్రెస్ నేతల నామినేషన్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇప్పటికే పార్టీ అధిష్ఠానం అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. మౌఖిక ఆదేశాల మేరకు నామినేషన్ వేసేందుకు వారిద్దరు సిద్ధమయ్యారు. నిన్న సాయంత్రం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

చంద్రబాబుకు ఆహ్వానం 
అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపారు.

గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్ భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీపీఎం ప్లీనరీ వాయిదా
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడంతో ఆ పార్టీ ప్లినరీ వాయిదా పడింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు, రేపు జరగాల్సిన సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత చర్చ జరగాల్సి ఉంది.

నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నిన్నటితో పోల్చితే.. బీపీ లెవెల్స్ నార్మల్‌కి చేరుకుంటున్నాయని తెలిపారు. లంగ్స్‌లో నీరుని తొలగిస్తున్నామన్నారు. ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో వైద్యులు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్స్‌కి తమ్మినేని స్పందిస్తున్నారు.

ఇరాన్​ సైన్యం దాడులు
పాక్‌లోని బలూచీ మిలిటెంట్ గ్రూప్​ జైష్ అల్​ అదిల్​కు చెందిన రెండు ప్రధాన స్థావరాలపై ఇరాన్​ సైన్యం దాడులు చేసింది. దీంతో బలూచీ మిలిటెంట్లు తమ భద్రతా బలగాలపై దాడి చేయడంతో ప్రతీకార చర్యగా ఈ దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది.

ఆర్ఆర్ఆర్ పనులపై ఆదేశం
తెలంగాణలో రీజినల్​ రింగ్​ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ఆర్​ఆర్​ఆర్​ భూ సేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఎంత ఆర్థిక భారమైనా భరిస్తామని చెప్పారు.