రేపు కేసారంలో ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు 

  • Published By: srihari ,Published On : June 17, 2020 / 01:22 PM IST
రేపు కేసారంలో ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు 

Updated On : June 17, 2020 / 1:22 PM IST

కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో జూన్ 18 (గురువారం) అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్నల్ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ అధికారులు పరిశీలించారు. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ రోజు (జూన్ 17, బుధవారం) రాత్రి 8 గంటలకు సూర్యాపేటకు సంతోష్ బాబు పార్థివదేహం చేరుకోనుంది. 

సంతోష్ బాబు పార్థివదేహాన్ని సూర్యాపేట స్వస్థలానికి ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు. రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ అనుసరించి సంతోష్ బాబు అంత్యక్రియల్లో పాల్గొనే వారికి అనుమతి ఇవ్వనున్నారు.

50 మంది కంటే ఎక్కువ మందికి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. సంతోష్ బాబు అంత్యక్రియలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామని సూర్యాపేట ఎస్పీ భాసర్కరన్ తెలిపారు. సంతోష్ బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చేవారంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు.