వలస కార్మికులకు క్వారంటైన్ చదువు.. విద్యావంతులను చేసింది!

కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో వివిధ ప్రాంతాలనుంచి పొట్టకూటి కోసం పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులంతా అక్కడే చిక్కుకుపోయారు. లాక్ డౌన్ ఎత్తేస్తారనుకుంటే మే 17 వరకు పొడిగించాయి ప్రభుత్వాలు. సొంత రాష్ట్రాలకు వెళ్లలేక పలుచోట్ల వలస కార్మికులు చిక్కుకుపోయారు. దాంతో ఆయా ప్రాంతాల్లోని అధికారులు వలస కార్మికులందరిని గ్రామీణ స్కూళ్లలో క్వారంటైన్ చేశారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కొంతమంది వలస కార్మికులు విద్య నేర్చుకునే అవకాశంగా మార్చుకున్నారు. రాజస్థాన్‌లో నాగౌర్ జిల్లాలోని ఓ రిమోట్ విలేజ్ ప్రభుత్వ పాఠశాలలో వీరంతా చదువుకుంటున్నారు. క్వారంటైన్ అయిన వలస కార్మికులు చదవడం, రాయడం కూడా నేర్చుకున్నారు.
అక్కడి స్కూల్ టీచర్లే వీరందరికి చదువు నేర్పినట్టు గ్రామస్థులు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పిటిఐ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని బరాన్ జిల్లాకు చెందిన 19 మంది వలస కార్మికులను నాగౌర్ లోని డొడియానా ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ అయ్యారు. అదే వీరికి ప్రయోజనంగా మారింది. క్వారంటైన్ సమయంలో స్కూళ్లో రోజువారీ తరగతులకు హాజరయ్యారు. అసలు చదవురాని వారంతా ఇప్పుడు చదవడం రాయడం కూడా నేర్చుకున్నారు. తమ పేర్లను కూడా రాస్తున్నారు. 0 నుంచి 10 అంకెలను చదివి రాస్తున్నారు. స్కూళ్లోని ఓ టీచర్ మాట్లాడుతూ.. ‘క్వారంటైన్ సమయంలో చదువులేనివారికి ‘అక్షర్ జ్ఞాన్’ నేర్పించాలని నిర్ణయించాం. కొంతమంది మినహా మిగతా వారంతా తమ పేర్లు రాస్తున్నారు.
0 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెడుతున్నారు. తమ మొబైల్ ఫోన్లలో నెంబర్లను సెర్చ్ చేయడం .. సేవ్ చేయడం కూడా నేర్చుకున్నారు’ అని చెప్పారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లో 74 మంది వలస కార్మికులు కాలినడకన తమ గ్రామాలకు వెళ్తుండగా అధికారులు అడ్డకున్నారు. వారందని జాపిపూర్ సమీపంలోని కోటపూత్లీలోని పాఠశాల భవనంలో క్వారంటైన్ చేశారు.
ఈ క్వారంటైన్ సమయంలో తమను జాగ్రత్తగా చూసుకున్నందుకు వారంతా స్కూల్ గోడలకు పెయింట్స్ వేసి అందంగా తీర్చిదిద్దారు. తమకు చదువు నేర్పిన టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో ఆంక్షలను సడలించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తిరిగి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది.