Telangana assembly election : తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో ఓటర్లకు తాయిలాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ప్రధాన రాజకీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే అధికార భారాస ఎన్నికల హామీ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. భారాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఓటర్లకు తాయిలాలు ప్రకటించాయి. ప్రధాన రాజకీయ పక్షాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపించాయి.....

revanthreddy,kcr,kishanreddy
Telangana assembly election : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ప్రధాన రాజకీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే అధికార భారాస ఎన్నికల హామీ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. భారాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ఓటర్లకు తాయిలాలు ప్రకటించాయి. ప్రధాన రాజకీయ పక్షాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపించాయి. మూడు ప్రధాన రాజకీయ పార్టీల హామీల వర్షంతో తడిసి పోతున్న ఓటర్లు ఎవరికీ ఓటు వేయాలనేది బేరీజు వేసుకుంటున్నారు.
ఓటర్లను ఆకట్టుకుంటున్న హామీపత్రాలు
అన్ని పార్టీ మ్యానిఫెస్టోలు కూడా ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. మూడు ప్రధాన రాజకీయపార్టీల మ్యానిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకువెళుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మూడు పార్టీల హామీలు చూసిన ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది డిసెంబరు 3వతేదీ ఫలితాల ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
ధరణి స్థానంలో భూభారతి.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ హామీపత్రాన్ని రూపొందించింది. హస్తం పార్టీ ఇప్పటికే పలు డిక్లరేషన్లను ప్రకటించింది. ఆరు గ్యారంటీల హామీతో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. శ్రీధర్ బాబు ఛైర్మన్ గా కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి హామీ పత్రాన్ని రూపొందించింది.
పసుపు కుంకుమ కింద తులం బంగారం
పసుపు కుంకుమ పేరిట పేదింటి యువతుల పెళ్లిళ్లకు లక్షరూపాయల నగదుతోపాటు తులం బంగారం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ ను తీసుకువస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు, రేషన్ డీలర్లు, వార్డు సభ్యులు గౌరవ వేతనం ప్రకటించే అవకాశముంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు, అమ్మ హస్తం పథకం పేరిట 9 నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
న్యాయవాదులు, విద్యార్థులకు ప్రత్యేక పథకాలు ప్రకటించనున్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ, విద్యార్థులకు మెట్రోలో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ, రెండులక్షల రూపాయల లోపు రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామిలిచ్చింది.
విద్య, వైద్యం ఉచితం.. బీజేపీ హామీ పత్రం
భారతీయ జనతాపార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో హామీల పత్రాన్ని శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. విద్య, వైద్యం ఉచితంగా అమలు చేయాలనే లక్ష్యంతో బీజేపీ మ్యానిఫెస్టోను రూపొందించింది. ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని బీజేపీ హామీ ఇస్తోంది. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్, వివాహిత మహిళలకు సంవత్సరానికి రూ.12వేలు, జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అంశాలు మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
వ్యవసాయకూలీలకు రూ.20వేల సాయం
బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ జి వివేక్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల జాప్యం అయింది. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.20వేలు, టీఎస్పీఎస్సీ పరీక్షల కోసం జాబ్ క్యాలెండర్, ఆరు నెలల్లో ఖాళీ పోస్టుల భర్తీ, ప్రతీ నెలా మొదటివారంలో ఉద్యోగ నియామకాలు, పీఎం ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు, రైతులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలను బీజేపీ మ్యానిఫెస్టోలో చేర్చిందని సమాచారం.
హాట్రిక్ విజయమే లక్ష్యంగా భారాస హామీల పత్రం
ఓటర్లను ఆకట్టుకొని హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతో గులాబీ బాస్ కేసీఆర్ భారాస ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99.95 శాతం పూర్తి చేశామని, మేనిఫెస్టోలో లేని పనులు కూడా చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతు బీమా పథకం తరహాలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటింటి ధీమా పథకం కింద రూ.5లక్షల సాధారణ బీమా ఇస్తామని ప్రకటించారు.
ALSO READ : Telangana assembly election : తెలంగాణలో త్రిముఖ పోరు…ప్రచార హోరు
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ, అన్ని పెన్షన్లు 5వేలరూపాయలకు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. మైనారిటీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం, మైనారిటీల సంక్షేమం, సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ. 3 వేల గౌరవ వేతనం,దివ్యాంగుల పెన్షన్లు రూ. 6 వేలకు పెంపు అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయి.
ALSO READ : Telangana assembly election : ఒకే పేరుతో వేర్వేరు అభ్యర్థులు…తికమక పడుతున్న ఓటర్లు
ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంపు,బీసీలకు అమలు చేస్తున్న పథకాలు అలాగే కొనసాగిస్తామని చెప్పారు. దళితబందు పథకం యథావిధిగా కొనసాగిస్తామని, గిరిజనేతరులకు కూడా పోడు భూములు ఇస్తామని,ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంచి, ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని భారాస తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది.