Telangana assembly election : తెలంగాణలో త్రిముఖ పోరు…ప్రచార హోరు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వం ముమ్మరం అయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న పోరులో ఆయా పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు....

Telangana assembly election : తెలంగాణలో త్రిముఖ పోరు…ప్రచార హోరు

assembly election campaign

Telangana assembly election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వం ముమ్మరం అయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న పోరులో ఆయా పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరనేది తేలింది. అధిక స్థానాల్లో అధికార భీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాడవాడలా, గ్రామగ్రామాన అభ్యర్థులు విస్తృతంగా తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంంత్రి కేసీఆర్ హెలికాప్టరులో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రోజుకు రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ భారీ బహిరంగ సభలు నిర్వహించి మరోసారి అవకాశమివ్వాలని ఓటర్లను కేసీఆర్ కోరుతున్నారు. మరో వైపు సీఎం తనయుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు సాగిస్తూ ప్రచార హోరు సాగిస్తున్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రచారం

కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ సభల్లో పాల్గొంటున్నారు. మరో వైపు బీజేపీ పక్షాన ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఈటెల రాజేందర్ లు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వతేదీన పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఈ నెల 28వతేదీనే ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

కేసీఆర్ బహిరంగ సభలు

కేసీఆర్ వంద సభల్లో పాల్గనాలనే లక్ష్యంతో హెలికాప్టరులో తిరుగుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావులు సభలు, రోడ్ షోలతో ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. ఒక వైపు ఇతర పార్టీల అసమ్మతి నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటూనే మరో వైపు పకడ్బందీ పోలింగ్ వ్యూహాలు పన్నుతున్నారు.

కాంగ్రెస్ ప్రచారంలో అగ్ర నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచార రంగంలోకి దిగారు. హస్తం నేతలు రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలపై ప్రధానంగా ఓటర్లలో ప్రచారం చేస్తూ తమను గెలిపిస్తే వాటిని అమలు చేస్తామని చెబుతున్నారు.

కమలం నేతల సుడిగాలి పర్యటనలు

బీజేపీ కూడా తన ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్ తిరుగుతూ సభల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ నగరంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులు కూడా పాతబస్తీ గల్లీల్లో ప్రచారం చేస్తున్నారు.

గల్లీల్లో మజ్లిస్ ప్రచార హోరు

ఎంఐఎంకు చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు గల్లీ సమావేశాలు నిర్వహిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ముమ్మర ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు భోజనం, మద్యం పంపిణీ చేస్తున్నారు. ప్రచారానికి వచ్చిన ప్రజలకు రోజువారీగా డబ్బులు చెల్లిస్తుండటంతో కూలి పనులకు వచ్చే వారు కరువయ్యారు.