శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుతపులి సంచారం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుతపులి సంచారం

Updated On : January 18, 2021 / 4:12 PM IST

tiger movement in shamshabad airport area : హైదరాబాద్ పరిసరాల్లో చిరుతపులుల సంచారం ప్రజలను భయపెడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పులులు సంచారం తో ప్రజలు హడలి పోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఎయిర్ పోర్టు పరిసరాల్లో సంచరించిన చిరుత ఆదివారం ఏకంగా రన్ వే పైకి వచ్చింది. రన్ వే పై దాదాపు 10 నిమిషాల పాటు సంచరించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది.

అనంతరం చిరుత గోడ దూకి బహుదూర్ గూడ పంట పొలాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు శంషాబాద్ తుక్కుగూడా దారిలో చిరుత సంచరిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ఒక వ్యక్తి 100 కి ఫోన్ చేసి చెప్పాడు. అప్రమత్తమైన పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టినా చిరుత జాడ కనిపెట్టలేక పోయారు. గతంలో శంషాబాద్ ప్రాంతంలో సంచరించిన చిరుతను అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. బహుదూర్ గూడ,గొల్లపల్లి, రషీద్ గూడ పరిసర గ్రామాల రైతులు పులి సంచారంతో భయపడుతున్నారు, అటవీ శాఖ అధికారులు తక్షణమే పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.