Today Headlines : దుర్గగుడి ఛైర్మన్ పై హత్యాయత్నం.. రిటైర్డ్ ఐఏఎస్ గోయల్ ఇంట్లో సోదాలు

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

Today Headlines : దుర్గగుడి ఛైర్మన్ పై హత్యాయత్నం.. రిటైర్డ్ ఐఏఎస్ గోయల్ ఇంట్లో సోదాలు

విజయవాడ దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం
విజయవాడలో కలకలం రేగింది. దుర్గ గుడి ఛైర్మన్ పై హత్యాయత్నం జరిగింది. కర్నాటి రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. గాజు సీసాతో పొడిచాడు. ఈ దాడిలో రాంబాబుకు కడుపులో గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు బంధువులు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

రిటైర్డ్ ఐఏఎస్ గోయల్ ఇంట్లో సోదాలు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల డబ్బులు గోయల్ ఇంట్లో డంప్ చేసినట్లు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్
Rythubandhu: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో వారం కూడా లేవు. అంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి ప్రభత్వ పథకాలు అమలులో ఉండవు. అందులో భాగంగానే మొదట రైతుబంధును నిలిపివేసినప్పటికీ.. తాజాగా పంపిణీకి అనుమతి లభించడం గమనార్హం.

వారొస్తే అంతే!
కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో దాడికి దిగారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్‌కౌంటర్లు.. ఎమర్జెన్సీలే.. ఉన్నాయని, కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంట్‌కు కటకటేనని విమర్శలు గుప్పించారు.

నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌
నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ గా ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

టెన్షన్‌.. టెన్షన్‌
కొల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ కార్యకర్తల పట్ల పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు.

ప్రతిఒక్కరికీ సొంత ఇల్లే లక్ష్యం: KTR
తెలంగాణలో ప్రతిఒక్కరికీ సొంత ఇల్లు కల్పించడమే బీఆర్ఎస్‌ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. హోమ్‌లోన్‌ తీసుకునే వారికి కొత్త పథకం తెస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చెప్పారు.

కన్నీటి నివాళి
అధికారిక లాంఛనాలతో ఆర్మీ జవాన్ల అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు వీరమరణం చెందిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. రాజౌరిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

భద్రత..బాధ్యత..
ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించమంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై డీజీపీ, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం బర్రెలక్క మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతరం భద్రత కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

కస్టడీ పొడిగింపు
లిక్కర్‌ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కస్టడీని పొడిగించారు. కాగా బెయిల్‌ పిటిషన్‌పై రేపు ట్రయల్‌ కోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ వీధుల్లో సింగపూర్ నకిలీ రిజిస్టర్డ్ కారు

నకిలీ కార్ నంబర్లకు సంబంధించి ఇండియాలోని సింగపూర్ హైకమిషన్ శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. 63 సీడీ ప్లేట్లు నకిలీవని, ఇది తమ కారు కాదంటూ కమిషన్ పేర్కొంది. సింగపూర్ హైకమీషనర్ సైమన్ వాంగ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందస్తూ.. “అలర్ట్! నంబర్ ప్లేట్ 63 CD ఉన్న ఈ కారు నకిలీది. ఇది సింగపూర్ ఎంబసీ కారు కాదు. దీనిపై విదేశాంగ శాఖ, పోలీసులను అప్రమత్తం చేశాం. మీరు ఈ కారును చూస్తే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీరు IGI (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) దగ్గర కారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి’’ అని ట్వీట్ చేశారు. కారుకు సంబంధించి రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు.

వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌9ఎన్2
కొవిడ్ ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా బయటపడనేలేదు. అప్పుడే డ్రాగన్ దేశం నుంచి మరో మహమ్మారి జెడలు విప్పుతోంది. చైనాలో కొత్తగా హెచ్‌9ఎన్2 వైరస్ వ్యాపిస్తోంది. ఇది ఎంత వేగంగా వ్యాపిస్తోందంటే.. ఇప్పటికే ఉత్తర చైనాలో వందల మంది చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

విచారణ వాయిదా ..
యూట్యూబర్‌ నాని హెబియాస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అయితే, బోట్ల ప్రమాదంలో నా ప్రమేయం లేదని నాని అన్నాడు.

వన్‌ మోర్‌ చాన్స్‌..
మాకు హాలిడే ఇవ్వకండి.. పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. చిన్న సమస్య ఉందని ధరణిని రద్దు చేయమనడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.

పట్టేశారు..
ఏపీ సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ సెక్షన్‌ ఆఫీసర్‌ పట్టుబడ్డాడు.

ఆస్పత్రి కింద టన్నెల్ ..
ఇజ్రాయెల్-హమాస్ వార్‌లో గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్‌-షిఫా కీలక కేంద్రంగా మారింది. ఆ ఆసుపత్రిపై పట్టు సాధించిన ఇజ్రాయెల్ దళాలు.. దానికింద టన్నెల్‌ ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను వెలుగులోకి తీసుకువచ్చాయి. దీనిని హమాస్‌ మిలిటెంట్లు మిలిటరీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ట్విటర్‌లో టన్నెల్‌ దృశ్యాలను షేర్ చేసింది.

ఉద్దేశ పూర్వకంగానే హాజరుకాలేదా?
భారత్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈనెల 22న జరిగిన వర్చువల్ జీ-20 సమ్మిట్‌కి కూడా ఆయన గైర్హాజరయ్యారు. దీంతో షీ జిన్‌పింగ్ ఆ ప్రతిష్టాత్మక సమావేశానికి ఎందుకు హాజరు అవ్వలేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఎందుకు హాజరవ్వలేదని భారత విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ను ప్రశ్నిస్తే… తమకు ఎవరు ప్రాతినిథ్యం వహిస్తారన్నది ఆ దేశమే నిర్ణయించుకోవాలని సమాధానం ఇచ్చారు.