Today Headlines: తాగి నడిపితే తప్పించుకోలేరు.. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు
హైదరాబాద్‌లో మూడు పద్ధతుల ద్వారా పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేస్తారు. లాలాజలం, యూరిన్..

Today Headlines in Telugu at 11PM
100 పరికరాలు కొన్న పోలీసులు
న్యూ ఇయర్ వేళ మత్తుపదార్థాల డిటెక్టర్ టెస్ట్‌ల కోసం నార్కోటిక్ పోలీసులు 100 పరికరాలు కొన్నారు. అబోట్, డ్రాగర్ కంపెనీలకు చెందిన ఈ పరికరాలు మనిషి శరీరంలో డ్రగ్స్‌ను డిటెక్ట్ చేస్తాయి ఈ పరికరాలు. హైదరాబాద్‌లో మూడు పద్ధతుల ద్వారా పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేస్తారు. లాలాజలం, యూరిన్ శాంపిల్ ద్వారా డ్రగ్స్ డిటెక్ట్ చేస్తారు. దాని ఫలితాలు రావడానికి కొన్ని రోజులు పడుతుందని అనుకుంటున్నారా? శాంపిల్ తీసుకున్న 6-8 నిమిషాల్లో ఫలితాలు వచ్చేస్తాయి. న్యూ ఇయర్ వేడుకల కోసం అంతా సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పబ్, రిసార్ట్స్ ఈవెంట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామన్నారు.
న్యూ ఇయర్ వేళ మెట్రో సేవలు పొడిగింపు
నూతన సంవత్సర వేడుకల వేళ రేపు అర్ధరాత్రి మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రేపు చివరి మెట్రో రైలు అర్ధరాత్రి దాటాక 12.15 గంటలకు తొలి స్టేషన్ నుంచి బయలుదేరి ఒంటి గంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు.
మోదీకి పవన్ లేఖపై కొట్టు సత్యనారాయణ స్పందన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాయడంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ సర్కారు భారీ స్కాంకు పాల్పడిందంటూ పవన్ లేఖ రాయడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… ఇళ్ల స్థలాల్లో రూ.35 వేల కోట్ల స్కాం జరిగిందని అంటున్న పవన్.. ఇందుకు సంబంధించిన ఆధారాలు చుపిస్తారా అని ప్రశ్నించారు.
కొవిడ్ కలకలం..
మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. గత రెండు రోజుల క్రితం ఆశ్రమంలోని ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటీవ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆశ్రమంలో ఉన్న 47మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో మరో నలుగురికి పాజిటీవ్ వచ్చింది. పాజిటీవ్ వచ్చిన ఐదుగురికి సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
జేసీ సోదరులకు బిగ్ షాక్..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ సోదరులకు బిగ్ షాక్ తగిలింది. 20 సంవత్సరాల నుంచి జేసీ సోదరులకు, టీడీపీ పార్టీకి న్యాయ సేవలు అందిస్తున్న లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైసీపీ కండువా కప్పి శ్రీనివాసులను పార్టీలోకి ఆహ్వానించారు.
నూతన బస్సులు ప్రారంభం..
తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. భాగ్యనగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. వీటిలో హైదరాబాద్ కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు చెప్పారు.
అయోధ్యలో మోదీ..
అయోధ్య లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. కాసేపట్లో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని ప్రారంభించనున్నారు.
షర్మిల వెంటే నా ప్రయాణం..
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల వెంటే నా ప్రయాణం అని స్పష్టం చేశారు. ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేది నిజమైతే నేనూ ఆమెవెంట నడుస్తానని అన్నారు.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖలో తెలంగాణ వ్యాప్తంగా ఓడీలను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పని ఓడీలపై పనిచేస్తున్న ఎవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల ఓడీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పవన్ తో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..
జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జిలను మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. జ్యోతుల చంటిబాబునుసైతం తప్పించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం.. అధికార పార్టీ నుంచి చంటిబాబుకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. తొలుత టీడీపీలో చేరేందుకు చంటిబాబు ప్రయత్నాలు చేశారని, జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో టీడీపీ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే జనసేన పార్టీతో టచ్ లోకి జ్యోతుల చంటిబాబు వెళ్లడంతోపాటు పవన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైసీపీలో చేరికపై వీరిమధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదం..
మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించారు. 55 మందికి గాయాలయ్యాయి.
కొనసాగుతున్న నిరసన..
ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. విశాఖలో రాత్రి దీక్షా శిబిరం వద్ద నిద్రపోయిన కార్మికులు శనివారం తెల్లవారుజామునుంచే ఆందోళనకు దిగారు. కేఆర్ఎం కాలనీ జీవీఎంసీ చెత్త వాహనాల యార్డ్ వద్ద నిరసన చేపట్టారు. చెత్త వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కేంద్రం గుడ్ న్యూస్ ..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 2016, జూన్ 30వ తేదీ నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది.
ఉగాది నుంచి నంది అవార్డులు..
నంది అవార్డులపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2024 ఉగాది నుంచి నంది అవార్డులను అధికారికంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చించినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
వివేకా కేసులో కీలక మలుపు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై శుక్రవారం పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషిట్ దాఖలు చేశారు.
ఈ- సూపర్ ఫాస్ట్ రైలు..
నేడు ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. అయోధ్యలో ’ఈ- సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.