ప్రేయసి ఇంట్లో బాక్సులో దాక్కున్న యువకుడు.. గాలిఆడక ఒక్కసారిగా..
ఓ మహిళ కుటుంబ సభ్యులు పనులకు వెళ్లారు. ఆ తర్వాత ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు మధ్యాహ్నానికి ఆమె ఇంటికి వచ్చాడు.
UP Man (Image Credit To Original Source)
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన
- ప్రియుడిని ఇంటికి పిలిచిన మహిళ
- అత్త రావడంతో బాక్సులో పెట్టి తాళం
Uttar Pradesh: ప్రియురాలి ఇంట్లో 45 నిమిషాలపాటు బాక్సులో దాక్కున్నాడు ఓ యువకుడు. గాలిఆడకపోవడంతో బాక్సును తట్టడం మొదలుపెట్టాడు. దీంతో అతడి బండారం బయటపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం ఓ మహిళ కుటుంబ సభ్యులు పనులకు వెళ్లారు. ఆ తర్వాత ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు మధ్యాహ్నానికి ఆమె ఇంటికి వచ్చాడు.
ఆ పక్క భవనంలోనే నివసించే ఆ మహిళ అత్తకు.. ఓ శబ్దం వినిపించింది. ఎవరో వచ్చారని అనుమానంతో ఆమె తలుపు తట్టింది. భయపడిన మహిళ తన ప్రియుడిని పెద్ద ఇనుప బాక్సులో దాచి తాళం వేసింది. ఆ తర్వాత తలుపు తెరిచి అత్తగారితో మాట్లాడింది.
ఎవరూలేరని చెప్పింది. అయితే, ఆమె అత్తకు అనుమానం తొలగలేదు. ఆమె గేటుకు తాళం వేసి ఇతర కుటుంబ సభ్యులను పిలిచింది. అల్మారాలు, మంచాల కింద, పైకప్పుపై వెతికారు. ఎవరూ కనిపించలేదు. 45 నిమిషాల తర్వాత బాక్సును ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది.
బాక్సులో నుంచి బయటకు రావడానికి యువకుడు ప్రయత్నించాడు. అతడి ప్రియురాలు ఆ బాక్సు తాళం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఇంటికి చేరుకుని, ఆ బాక్సును తెరిపించారు.
అందులో నుంచి చెమటతో తడిసిపోయి గాలి కోసం ఊపిరి పీల్చుకుంటూ యువకుడు బయటకు వచ్చాడు. అతడు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతడిని కొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకున్నారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
