Today Headlines : కన్నీరు పెట్టుకున్న ఏపీ మంత్రి.. విశాఖ అర్బన్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ వంశీ
జనసేన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని వంశీకృష్ణ యాదవ్‌కు పవన్ దిశా నిర్దేశం చేశారు.

Today Headlines in Telugu at 11PM
మంత్రి అమర్నాథ్ కంటతడి
ఏపీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టారు. అనకాపల్లి వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారాయన. అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇంఛార్జి మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. మిమ్మల్ని వీడి బాధతో వెళ్తున్నా, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.
విశాఖపట్నం అర్బన్ జిల్లా జనసేన అధ్యక్షుడి నియామకం
అమరావతి: విశాఖపట్నం అర్బన్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. జనసేన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని వంశీకృష్ణ యాదవ్‌కు పవన్ దిశా నిర్దేశం చేశారు.
ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీలోని తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకుని, ఆ తర్వాత తాడేపల్లి వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు షర్మిల అందించారు. వైఎస్ షర్మిల వెంట కడపకు వచ్చిన తల్లి విజయమ్మ.. ఆ తర్వాత షర్మిలతో కలిసి జగన్ వద్దకు మాత్రం వెళ్లలేదు. కడప నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. జగన్‌కు శుభలేఖ ఇచ్చాక షర్మిల ఢిల్లీకి వెళ్లారు. రేపు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరే అవకాశం ఉంది.
ఐఏఎస్, ఐపీఎస్‌ల క్యాడర్ కేటాయింపులపై తీర్పు
ఐఏఎస్, ఐపీఎస్‌ల క్యాడర్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. క్యాట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. 13 మంది అధికారుల క్యాడర్ కేటాయింపుపై క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. కేటాయింపులపై అధికారులు తిరిగి కేంద్ర సర్కారుని అభ్యర్థించాలని సూచించింది. క్యాట్ స్టే ఉత్తర్వులను కేంద్రం సవాలు చేయడంతో దీనిపై విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది.
సీఎం రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో గాంధీభవన్ లో ప్రారంభమైంది. పార్లమెంటరీ ఎన్నికల వ్యూహం, పార్టీ బలోపేతంపై ఈ భేటీలో చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న నెలరోజుల ప్రభుత్వ పాలన, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చర్చించనున్నారని సమాచారం. పలువురు మంత్రులు, కాంగ్రెస్ రాష్ట్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
‘అమరావతి’ కేసుల విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో ‘అమరావతి’ కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఆ నెలలో పూర్తి స్థాయిలో వాదనలు విన్న తరువాతే తాము తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏపీ సర్కారు తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదన వినిపిస్తూ.. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తీరు సమంజసం కాదని తెలిపారు. రైతుల తరఫున వాదించిన న్యాయవాది దేవదత్ కామత్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని చెప్పారు.
విచారణకు హాజరు..
అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని చంపి తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ టీవీ డిబేట్లో శ్రీనివాసరావు సుపారీ ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల రాంగోపాల్ వర్మ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావుకి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఆయన ఇవాళ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలి..
అదానీ – హిండెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సెబీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణ బదిలీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదని తెలిపింది.
పెరుగుతున్న కొవిడ్ కేసులు..
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 602 కరోనా కేసులు నమోదు కాగా.. కొవిడ్ తో చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఈడీ సోదాలు ..
ఝార్ఖండ్ లోని 12 ప్రాంతాల్లో ఈడీ బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తుంది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఘోర రోడ్డు ప్రమాదం..
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొకున్న ప్రమాదంలో 14మంది మరణించగా.. 25మంది వరకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇంకా ఖరారు కాలేదు..
అయోధ్యలో ఈనెల 22న ప్రతిష్టించనున్న రామ్ లల్లా విగ్రహం ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు స్పష్టం చేసింది. అంతకుముందు అయోధ్యలో ప్రతిష్టకు కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి అరున్ యోగిరాజ్ తయారు చేసిన ప్రతిమను ఎంపిక చేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సైతం శిల్పిని అభినందించారు. ఈ వార్తల నేపథ్యంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు స్పందించింది. రామ్ లల్లా విగ్రహం ఖరారుపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్..
గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్ వంటి ఇతర యాప్స్ తో పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే రియల్ టైమ్ లొకేషన్ పంపొచ్చు. ఎంత సమయమైనా అది ఆన్ లోనే ఉంటుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్ లో లాగిన్ అవ్వాలి. పైన కుడివైపున్న ప్రొఫైల్ అకౌంట్ పై క్లిక్ చేసి అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్ పై కనిపిస్తున్న న్యూ షేర్ పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ చేయాలి.
ఢిల్లీలో కీలక భేటీ..
దేశంలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ ఈనెల 4న ఢిల్లీలో సమావేశం కానున్నారు. లోక్ సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి చేపట్టబోయే భారత్ న్యాయ్ యాత్ర (జోడో యాత్ర-2) సన్నాహాలపై చర్చించనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నారు.