విశాఖ గ్యాస్ లీక్ : మహిళల ఖాతాల్లోనే..ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు

విశాఖపట్టణం స్టైరిన్ గ్యాస్ లీక్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ గ్యాస్ లీక్ కారణంగా 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వందల మంది అనారోగ్యానికి గురై..ఆసుపత్రిలో చికిత్స పొందారు. చనిపోయిన కుటుంబసభ్యులకు..ఇతరులకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.
గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధికారులను ఆదేశించారు. 2020, మే 11వ తేదీ సోమవారం..మంత్రులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
2020, మే 12వ తేదీ మంగళవారం…వాలంటీర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి..బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమం కేవలం మూడు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారాయన. ఆర్థిక సాయం..అందించే కార్యక్రమం అత్యంత పారదర్శకంగా సాగాలని, ఎలాంటి ఫిర్యాదులు రావొద్దన్నారు. ఈ సాయం పొందే వారి వివరాలు గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరి పేరు లేకపోతే..ఎలా…నమోదు చేసుకోవాలో వారికి సూచించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఖాతాల్లో డబ్బులు జమ అయిన తర్వాత..వాలంటీర్ల ద్వారా చిట్టీ అందించి..రశీదు తీసుకోవాలన్నారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్యం అందించేందుకు క్లినిక్ లు ఏర్పాటు చేయాలని, గ్యాస్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు, వైద్యులను సీఎం జగన్ అభినందించారు.
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స చేసుకున్న వారికి రూ.25 వేలు. ఆస్పత్రిలో రెండు, మూడు రోజులు ఉన్నవారికి రూ.లక్ష. వెంటి లెటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
Read More:
* విశాఖ ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన
* విశాఖ స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు రూ.కోటి చెక్కులు అందజేసిన మంత్రులు