బెంగాల్ మహిళలకు బీజేపీ హామీ : మేం అధికారంలోకి వస్తే 33శాతం రిజర్వేషన్లు

west bengal amit shah women 33 % Reservations promise : బెంగాల్‌ల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కమ్యూనిస్టులు కంచుకోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తృణముల్ కాంగ్రెస్ కోటను కూల్చి కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. దీని కోసం ఎప్పటినుంచో పావులు కదుపుతోంది. బీజేపీ అగ్రస్థాయి నాయకులు సైతం బెంగాల్లో పాగా వేసి నెట్ వర్క్ ఎప్పటినుంచో ప్రారంభించిన విషయం తెలిసిందే.
మరికొన్ని రోజుల్లో పశ్చిమబెంగాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న క్రమంలో దీదీకి..కాషాయ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంట్లో భాగంగానే కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో బెంగాల్ మహిళలకు హామీలు కూడా కురిపించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీనే గెలపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బెంగాల్ ప్రజలు తమకే బ్రహ్మరథం పడతారని…ఇప్పటి వరకూ బెంగాల్‌లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని ఆరోపించారు. బెంగాల్ కు మహిళా ముఖ్యమంత్రే ఉన్నప్పటికీ మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారని ఇది చాలా అన్యాయమని విమర్శించారు.
బెంగాల్‌లోని దక్షిణ 24 పర్గనాల జిల్లాలో గురువారం (ఫిబ్రవరి 18) జరిగిన పరివర్తన ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తూ..బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అమిత్ షా బెంగాల్ మహిళలకు హామీ ఇచ్చారు. మరోవైపు దక్షిణ 24 పరగణాల జిల్లాలో గురువారం దాదాపు ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో అటు అమిత్‌షా, ఇటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇద్దరు వేర్వేరు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఇదిలా ఉంటే ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు టెన్షన్ టెన్షన్ గానే గడిపారు ఈ కార్యక్రమాలు పూర్తి అయ్యేంత వరకూ..అమిత్ షా, మమతా బెనర్జీ సభలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ముఖ్యంగా పోలీసులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అమిత్ షా ఒకే జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఇదే తొలిసారి.
గత దశాబ్దకాలంగా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. టీఎంసీ 22 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని గద్దె దింపి.. అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ భావిస్తోంది. 294 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి.