Dussehra 2023 : పాండవులకు పాలపిట్టకు సంబంధమేంటి..?దస‌రా రోజు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి..?

దసరా రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనక ఉన్న కారణమేంటి..పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి..?

Dussehra 2023 : పాండవులకు పాలపిట్టకు సంబంధమేంటి..?దస‌రా రోజు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి..?

palapitta importance in dussehra festival

Updated On : October 16, 2023 / 11:22 AM IST

Dussehra.. Palapitta : దసరా పండుగ వచ్చిదంటే చాలు మహిళలు దేవి నవరాత్రుల పండుగల్లో మునిగిపోతారు. ప్రతీ ఇల్లు ఆధ్మాత్మిక శోభతో కళకళలాడిపోతుంటుంది. గుమ్మానికి మామిడి తోరణాలు, గడపలకు పసుపు, కుంకుమలు ఇలా ఇల్లంతా పూజల శోభతో నిండిపోతుంది. ఒక్కో రోజు అమ్మావారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శమిస్తుంది. దసరా పండుగ పేరు ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయాలతో జరుపుకుంటారు. దేశంలో ఉన్నది తెలుగు రాష్ట్రాలు రెండే అయినా ఈ రెండు రాష్ట్రాలో జరుపుకునే దసరా పండుగ భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో  బతుకమ్మగా జరుపుకుంటారు. ఆంధ్రాలో దేవీ నవరాత్రులుగా జరుపుకుంటారు.

దసరాగా జరుపుకున్నా..బతుకమ్మగా జరుపుకున్నా ఒక్కటే. బతుకమ్మ పండుగలో పువ్వులే అగ్రస్థానం. తెలంగాణలో బతుకమ్మ పండుగగా జరుపుకున్నా.. దసరా పండుగ రోజున అంటే విజయదశమి రోజున ‘పాలపిట్ట’ను చూడటం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. బహుశా అందుకేనేమో  రాష్ట్రం ఏర్పడ్డాక పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించి గౌరవం ఇచ్చింది ప్రభుత్వం.

సాధారణ రోజుల్లో కనిపించినా కనిపించకపోయినా విజయదశమి రోజు పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తుందని అంటారు తెలంగాణావాసులు. దశమి రోజున గ్రామాల్లో ప్రజలు పాలపిట్టను చూడటానికి పొలాలకు వెళతారు. దశమి పర్వదినం నాడు పంట పొలాల్లో తళుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. నగరాల్లో పాలపిట్ట కనిపించదు కాబట్టి కొంతమంది పండుగ రోజున పాలపిట్టను పంజరంలో బంధించి తీసుకొస్తారు. పంజరానికి ముసుగు వేసి వీధి వీధిల్లో తిరుగుతు ‘పాలపిట్టమ్మా పాలపిట్ట’ అని పిలుస్తారు. ఎవరైనా చూడాలనుకునేవారు డబ్బులిచ్చి చూస్తారు. ఈ సంప్రదాయం వెనుక కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

పాండవులకు పాలపిట్ట దర్శనం..
పూర్వం పాండవులు జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయాక కురుపాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాత వాసం కూడా ముగించుకుని తిరిగి వస్తుండగా వారికి దారిలో పాలపిట్ట కనిపించిందట. దీంతో వారు శుభం కలుగుతుందని నమ్మారట. అలా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాత వాసం ముగిసిన రోజు విజయదశమి పండుగ రోజునే. విజయదశమి రోజున పాలపిట్ట కనిపించటంతో ఇక తమకు అన్నీ శుభాలు, విజయాలే కలుగుతాయని నమ్మారట. ఈ క్రమంలోనే కురుక్షేత్రం యుద్ధం జరగటం..పాండవులు విజయం సాధించటం జరిగింది. విజయదశమి రోజున పాలపిట్టను చూసినందుకు విజయం సిద్ధించిందనే కారణంతో అదో ఆచారంగా దశమి రోజున పాలపిట్టను చూడటం సంప్రదాయంగా మారిందని చెబుతుంటారు. అలా విజయదశమి రోజున మగవాళ్లు అడవికి వెళ్లి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అది సంప్రదాయంగా కొనసాగుతోంది.

రావణుడితో రాముడి యుద్ధం..పాలపిట్టను చూసిన రఘురాముడు
మరో కథ ఏమిటంటే..శ్రీరాముడే రావణుడితో యుద్ధానికి వెళ్లేముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విజయదశమి రోజున ఈ పిట్టని చూస్తే అంతా మంచి జరుగుతతుందని ప్రజల నమ్మకం.

విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని.. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని నమ్ముతుంటారు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడటానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే.. జమ్మిచెట్టుతో పాటు పాలపిట్టను చూడాలని ఆకాంక్షిస్తుంటారు.