Heart Disease : యుక్త వయస్సులో గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే?

గుండెకు హాని కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి, తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోంస ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి.

Heart Disease : యుక్త వయస్సులో గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే?

Heart

Updated On : June 17, 2022 / 6:44 AM IST

Heart Disease : మనిషి శరీరంలోని అవయవాల్లో గుండె కీలకమైనది. అన్ని అవయవాలకు గుండె ద్వారా రక్తం సరఫరా జరుగుతుంది. గుండె మందంగా ఉండే కండరపు గోడలను కలిగి ఉంటుంది. గుండె రక్తన్ని పంపిణీ చేయటంలో విషలమైతే గుండె ఫెయిల్యూర్ గా చెప్పవచ్చు. గుండె జబ్బులు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో యుక్తవయస్సు వారిలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

జీవనశైలి, అతిగా మద్యపానం, ధూమపానం, అధిక బరువు, ఒత్తిడి, రక్తపోటు,మధుమేహం శారీరక శ్రమ లేకపోవడం, హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ఇతర కారణాల వల్ల యువకులలో కరోనరీ హార్ట్ డిసీజ్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని రకాల పరీక్షల ద్వారా గుండె సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ నిర్ధారించడానికి, రక్తపోటు, పల్స్ రేటు, ఈసీజీ, ఎకో కార్డియోగ్రఫీ ట్రోపోనిన్ పరీక్ష వంటి క్లినికల్ పరీక్షలు దోహదం చేస్తాయి. పరీక్షల్లో లక్షణాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సను అందిస్తారు.

గుండెకు హాని కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి, తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోంస ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ప్యాక్ చేసిన ఆహారాన్ని నివారించటం మేలు. రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆందోళన ఎక్కువగా ఉంటే ఉదయాన్నే నిద్రలేచి యోగా, ధ్యానం వంటివి చేయటం ద్వారా ఆందోళనను తగ్గించుకోవచ్చు. ఒంటరితనం పోగొట్టుకొనే ప్రయత్నం చేయండి.

ధూమపానం, పొగను పీల్చడం మానుకోవటం ఉత్తమం. గుండెను అనారోగ్యం పాలు చేసే వాటిలో ఈ రెండింటి వల్లే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి. రోజు వారి వ్యాయామాలు చేయటం మంచిది. వ్యాయామం లాంటివి చేయకపోతే గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా కొంతమంది అతిగా తినేస్తుంటారు. దీని కారణంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలు క్రమంగా గుండె వైఫల్యాలకు దారితీస్తాయి.

గుండెకు సంబంధించి ఏచిన్న సమస్యను గుర్తించినా వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. ఎందుకంటే సకాలంలో సమస్యకు చికిత్స అందిస్తే గుండెపోటు సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.