Mayasabha : ‘మయసభ’ సిరీస్ రివ్యూ.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహంపై వెబ్ సిరీస్..

దేవాకట్టా దర్శకుడు అంటూ మయసభ టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. ఈ సిరీస్ టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడే ఇది చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ అని అర్థమైపోయింది.

Mayasabha : ‘మయసభ’ సిరీస్ రివ్యూ.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహంపై వెబ్ సిరీస్..

Mayasbha

Updated On : August 7, 2025 / 6:31 AM IST

Mayasabha Web Series Review : హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మాణంలో దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’. ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, తాన్యా రవిచంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు మెయిన్ లీడ్స్ లో నటించారు. మయసభ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో నేడు ఆగస్టు 7 నుంచి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికొస్తే.. కృష్ణమ నాయుడు(ఆది పినిశెట్టి) నరసపల్లిలో ఎక్కువగా చదివిన కుర్రాడు. ఇంట్లో వాళ్ళు వద్దన్నా తిరుపతిలో ఉంటూ పై చదువులు చదువుతూ ఉంటాడు. కృష్ణమకు రాజకీయాలంటే ఆసక్తి. కానీ అప్పుడు రాష్ట్రంలో ఒకటే కులం చేతిలో రాజకీయాలు ఉంటాయి. మరోవైపు పులిచర్లలో ఓ ఫ్యాక్షనిస్ట్ కొడుకు రామిరెడ్డి(చైతన్య రావు). అతనికి తండ్రి చేసే ఫ్యాక్షన్ పనులు నచ్చవు. బెంగుళూరులో డాక్టర్ చదువుతూ అక్కడ హీరోల కోసం గొడవ పడటంతో అతన్ని తిరుపతికి ట్రాన్స్ఫర్ చేస్తారు.

కృష్ణమ నాయుడు కాలేజీ ఎన్నికల్లో ఓడిపోవడం, తను ప్రేమించిన అమ్మాయి అను(తాన్యా రవిచంద్రన్) హీరోయిన్ అవుతాను అని వదిలేసి వెళ్లిపోవడంతో బాధలో ఉంటాడు. అదే సమయంలో రామిరెడ్డి ప్రేమించిన అమ్మాయి(వైష్ణవి)ని పెళ్లి చేసుకొని తండ్రి ఫ్యాక్షన్ పద్ధతులు నచ్చక భార్యతో కలిసి తిరుపతికి ప్రయాణమవుతాడు. అప్పుడే ఓ కమ్యూనిస్ట్ లీడర్ ని చంపేయడంతో కృష్ణమ నాయుడు, రామిరెడ్డి అనుకోని పరిస్థితుల్లో మొదటిసారి కలుస్తారు.

అనంతరం దేశంలో ఎమర్జెన్సీ రావడంతో ఓ ఘటనతో కృష్ణమ నాయుడు పార్టీ కార్యకర్తగా, రామిరెడ్డి డాక్టర్ గా కలుస్తారు. అక్కడ జరిగిన ఓ గొడవలో వీరిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఎమర్జెన్సీ తర్వాత అనుకోకుండా ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, ఇద్దరూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో వీరి ప్రయాణం మొదలవుతుంది. ఎమర్జెన్సీ తర్వాత ఏపీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి? డెమొక్రటిక్ పార్టీ అధినేత ఐరా బసు(దివ్యదత్త) ఏం చేస్తుంది? కృష్ణమ నాయుడు, రామిరెడ్డి మంత్రులు ఎలా అయ్యారు? వాళ్ళ లక్ష్యం ఏంటి? సినిమా స్టార్ RCR (సాయి కుమార్) పార్టీ ఎందుకు పెట్టారు? RCR పార్టీ పెట్టిన తర్వాత ఏపీలో పరిస్థితులేంటి? కృష్ణమ నాయుడు RCR కి ఎలా అల్లుడయ్యాడు ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Also Read : Mythri Naveen : ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచలేము.. మైత్రీ నిర్మాత కామెంట్స్ వైరల్..

సిరీస్ విశ్లేషణ.. ప్రస్థానం, రిపబ్లిక్, ఆటోనగర్ సూర్య.. లాంటి సినిమాలతో దేవాకట్టాకు స్పెషల్ గుర్తింపు వచ్చింది. సమాజంలో ఉన్నవి, జరిగేవి రియల్టీలో చూపిస్తారు. దేవాకట్టా దర్శకుడు అంటూ మయసభ టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. ఈ సిరీస్ టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడే ఇది చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ అని అర్థమైపోయింది. దీంతో ఈ సిరీస్ పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. అప్పటి రాజకీయ నాయకులను, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాత్రలను రిఫరెన్స్ గా తీసుకున్నా వాళ్ళ చుట్టూ పర్సనల్ జీవితాలను మాత్రం కొంత కల్పితంగా రాసుకున్నారు.

సిరీస్ పరంగా చూస్తే అప్పట్లో సీమలో ఫ్యాక్షన్ గొడవలు, సినిమా హీరోల కోసం గొడవలు, ఇద్దరు హీరోలకు కల్పిత ప్రేమ కథలతో మొదటి మూడు ఎపిసోడ్స్ సింపుల్ గా కాస్త సాగదీతతో నడుస్తాయి. ఈ ఇద్దరూ కలిసిన దగ్గర్నుంచి సిరీస్ ఆసక్తిగా మారుతుంది. వీరిద్దరూ ఫ్రెండ్స్ అయి రాజకీయాల్లోకి ఎంట్రీ చ్చిన తర్వాత పొలిటికల్ థ్రిల్లర్ లా మారుతుంది. విజయవాడలో గొడవలు, కులాల గొడవలు, దివిసీమ ఉప్పెన, ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఏపీ సీఎంలను మార్చడం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, ఎన్టీఆర్ చంద్రబాబుని అల్లుడు చేసుకోవడం, వంగవీటి రంగ పాత్ర, పరిటాల రవి పాత్ర.. ఇలాంటి రిఫరెన్స్ లతో చివరి మూడు ఎపిసోడ్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తితో కథాంశం పరిగెడుతుంది. క్లైమాక్స్ ఆశ్రమ్ హోటల్ ఎపిసోడ్ తో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని బ్యాంగ్ ఇచ్చి సీజన్ 2 కి లీడ్ ఇచ్చారు. సీజన్ 2లో కృష్ణమ నాయుడు వర్సెస్ రామిరెడ్డి స్నేహితులు ప్రత్యర్థులుగా ఎలా మారారు అనే కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.

అయితే దేవాకట్టా ముక్కుసూటిగా సమాజంలో జరిగేది చెప్పే మనిషి కావడం, సిరీస్ కి సెన్సార్ లేకపోవడంతో కులాల పేర్లు డైరెక్ట్ గా చెప్పేయడం, అప్పటి రాజకీయ నాయకులందరినీ రిఫరెన్స్ తీసుకొచ్చి చూపించడం. కొన్ని సంఘటనలు రియల్ గా జరిగింది చూపించడంతో ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఈ సిరీస్ వివాదాస్పదం అవుతుందేమో చూడాలి మరి. కానీ పొలిటికల్ సంఘటనలను, అప్పటి పరిస్థితులను చూపించిన విధానానికి దేవాకట్టా గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చంద్రబాబు, వైఎస్సార్ మంచి స్నేహితులు అనేది గతంలో వాళ్ళు ఇద్దరూ పలుమార్లు చెప్పారు. ఇప్పటివరకు ఏపీ పొలిటికల్ పరిస్థితులపై అనేక సినిమాలు వచ్చినా చంద్రబాబు – వైఎస్సార్ స్నేహంపై లోతుగా వెళ్లి తీయడం మాత్రం ఇదే మొదటిసారి. కొంచెం కల్పితాలు తీసుకున్నా వారి స్నేహం ప్రయాణం కొత్తగానే చూపించారు దేవాకట్టా. పొలిటికల్ సిరీస్ లు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, మన ఏపీ రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆ పార్టీల వాళ్ళు, వారి అభిమానులు ఈ సిరీస్ చూడాల్సిందే.

 Mayasabha

నటీనటుల పర్ఫార్మెన్స్.. కృష్ణమ నాయుడు అనే పాత్రలో ఆది పినిశెట్టి చంద్రబాబు రిఫరెన్స్ గా బాగానే మెప్పించాడు. చైతన్య రావు మొదట్లో మాములుగా కనిపించినా తర్వాత రామిరెడ్డి పాత్రలో రాజశేఖర్ రెడ్డిగా ఒదిగిపోయాడు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ రిఫరెన్స్ RCR పాత్రలో సాయి కుమార్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఇందిరాగాంధీ రిఫరెన్స్ పాత్ర ఐరా బసు పాత్రలో బాలీవుడ్ నటి దివ్య దుత్త బాగానే మెప్పించింది. సీఎం పదవి కోసం పరితపించే పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నాదెండ్ల భాస్కర్ రిఫరెన్స్ గా అదరగొట్టేసారు. హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ సిరీస్ లో కూడా హీరోయిన్ పాత్రలో, కాలేజీ అమ్మాయిగా బాగానే సెట్ అయింది. రామిరెడ్డి తండ్రి, ఫ్యాక్షనిస్ట్ పాత్రలో శంకర్ మహంతి కూడా తన నటనతో అదరగొట్టేసాడు. నాజర్, రవీంద్ర విజయ్, శత్రు, భావన వజపండల్, చరిత వర్మ, రఘుబాబు, సకుల్ శర్మ.. వారి వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు.

Also Read : GHAATI : అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ ఇంకా బాగా చేయించాల్సింది. ఎడిటింగ్ పరంగా మొదటి నాలుగు ఎపిసోడ్స్ లో కొన్ని సాగదీసిన సీన్స్ షార్ప్ కట్ చేస్తే బాగుండు కానీ వెబ్ సిరీస్ అంటే స్లో నేరేషన్ అనేలా ఇటీవల అందరూ అదే ఫాలో అవుతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ ని మాత్రం మెచ్చుకోవలసిందే. ఆ కాలానికి తగ్గట్టు అందరికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా కాస్ట్యూమ్స్ సెట్ చేసారు. అందరికి తెలిసిన కథ అయినా కొన్ని కల్పితాలు జోడించి మరింత ఆసక్తికర పొలిటికల్ కథాంశంతో చెప్పారు దేవాకట్టా. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు. డైలాగ్స్ మాత్రం పవర్ ఫుల్ గా, వివాదాస్పదంగా ఉన్నది ఉన్నట్టు రాసారు. నిర్మాణ పరంగా ఈ సిరీస్ కు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘మయసభ’ సిరీస్ చంద్రబాబు – వైఎస్సార్ రిఫరెన్స్ లతో వాళ్ళ స్నేహం, ఏపీ, దేశ రాజకీయాల కథాంశంతో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సిరీస్ లో దేవాకట్టా మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఈ సిరీస్ కి 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.