Sonu Sood: ‘మీ నాన్నను కాపాడతా’.. తండ్రి గుండె ఆపరేషన్‌ కోసం తల్లడిల్లుతున్న యువకుడికి సోను సూద్ భరోసా

తండ్రికి గుండె ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక ఓ యువకుడు తల్లడిల్లిపోయాడు. తమ దయనీయ పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతని పోస్టుపై నటుడు సోనూ సూద్ స్పందించారు.

Sonu Sood: ‘మీ నాన్నను కాపాడతా’.. తండ్రి గుండె ఆపరేషన్‌ కోసం తల్లడిల్లుతున్న యువకుడికి సోను సూద్ భరోసా

Uttar Pradesh

Uttar Pradesh : ప్రాణాపాయస్థితిలో తండ్రి ఆరోగ్యం.. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం తల్లడిల్లిపోయిన ఓ యువకుడు తన కష్టాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నటుడు సోనూసూద్ అతని పోస్టుపై స్పందించడమే కాదు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. వీరి పోస్టు వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని డియోరియాకు చెందిన పల్లవ్ సింగ్ అనే యువకుడు తన తండ్రి గుండె 20 శాతం మాత్రమే పనిచేస్తోందని.. ఆయన బతకాలంటే శస్త్రచికిత్స అవసరం అని పూర్తి వివరాలతో ట్విట్టర్‌లో పోస్టు చేసాడు. ఆ పోస్టు చూసిన నెటిజన్లు చలించిపోయారు. ఇక అతని పోస్టుపై నటుడు సోనూ సూద్ స్పందించారు.

పల్లవ్ సింగ్ ఇటీవల ట్విట్టర్ లో ‘నా తండ్రి త్వరలో చనిపోవచ్చు.. అవును నేను చెప్పేది నాకు తెలుసు. ఢిల్లీ ఎయిమ్స్‌లో క్యూలో నిలబడి ఇదంతా రాస్తున్నాను’ అంటూ వివరంగా ట్వీట్ చేసారు. పల్లవ్ సింగ్ తండ్రికి సెప్టెంబర్ 15 న గుండెపోటు వచ్చింది. తన స్వస్థలమైన డియోరియాకు దగ్గరలో గోరఖ్ పూర్‌లో ఉన్న ఆసుపత్రిలో చూపించాడు. అతని మూడు ధమనుల్లో బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అతని గుండె 20 శాతం మాత్రమే పనిచేస్తోందని వైద్యులు చెప్పారు. దాంతో పల్లవ్ సింగ్ తండ్రిని ఢిల్లీ AIMS కి తీసుకువచ్చాడు. అక్కడ పల్లవ్ సింగ్ తండ్రిని పరీక్షించిన డాక్టర్లు గుండె బలహీనంగా ఉందని, మందులు రాసి తర్వాత రమ్మని చెప్పారు. అతనికి శస్త్రచికిత్స చేయడానికి తేదీ లేదని ఆపరేషన్ జరగాలంటే 13 నెలలు వేచి ఉండాలని స్పష్టం చేశారు. అదీ లక్ష రూపాయలు చెల్లించి. అప్పటికే పల్లవ్ సింగ్ తండ్రి ఆరోగ్యం చాలా  క్రిటికల్‌గా ఉంది.

Also Read: బదిలీపై వెళ్తున్న తెలుగు ఎస్పీకి అపూర్వ వీడ్కోలు.. గుజరాత్‌లో సినిమా సన్నివేశాన్ని తలపించిన సీన్

మరోవైపు పల్లవ్ సింగ్ తల్లి న్యూరోలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతోంది. అతని ఉద్యోగం ఆధారం తప్ప ఆ కుటుంబానికి మరో ఆదాయం లేదు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకునేంత ఆర్ధిక పరిస్థితీ లేదు. తాను ఎదుర్కుంటున్న పరిస్థితులను మొత్తం వివరంగా పల్లవ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై నటుడు సోనూ సూద్ స్పందించారు. ‘మేము మీ తండ్రిని చనిపోనివ్వము సోదరా.. నా వ్యక్తిగత ట్విట్టర్ ఐడీ ఇన్ బాక్స్‌కి డైరెక్ట్ గా నీ నంబర్ మెసేజ్ చేయండి.. దయచేసి ట్వీట్‌లో పోస్టు చేయవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.

Also Read: ఎమ్మెల్యేగా గెలిచిన యాంకర్.. మిజోరాం ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన యువతి

మరోవైపు ‘దయచేసి ముంబయి రండి.. వీలైనంత త్వరగా (3-4 రోజుల్లో) సియోన్ ఆసుపత్రిలో చికిత్స చేస్తాము అంటూ’ డాక్టర్ ప్రశాంత్ మిశ్రా స్పందించారు. సోషల్ మీడియాలో పల్లవ్ సింగ్ పోస్టు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ స్పందించింది.  పల్లవ్ సింగ్ తండ్రికి సాయం అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ వారి  హెల్ప్‌లైన్ నంబర్‌ను ట్విట్టర్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ చేసింది. ఎయిమ్స్ స్పందన తర్వాత  సాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ పల్లవ్ సింగ్ పోస్టు పెట్టాడు. ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో నిలబడ్డ యువకుడికి నటుడు సోనూ సూద్‌తో పాటు ఎంతోమంది మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. ఈ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.