లక్ష్మీ’స్ ఎన్టీఆర్‌కు ఇంకా తొలగని అడ్డంకులు

లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాకు ఇంకా అడ్డంకులు తొలగలేదు. చంద్రబాబు వెన్నుపోటు అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నికల వేళ పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ..ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి ప్రజాప్రయోజన వ్యాజ్యం.
ఈ క్రమంలో పిటీషన్‌పై జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు. దుర్గాప్రసాద్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అభ్యంతకరమైన సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయని, అధికార పార్టీ నేతల గురించి మరీ హీనంగా మారిపోయి సినిమాని తీశారని, దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘం నోటీసు కూడా ఇచ్చినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు.
అయితే కేంద్ర సెన్సార్‌బోర్డు సినిమాకు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పారు. శుక్రవారం విడుదల అయితే అధికార పార్టీ పరువుకు భంగం కలుగుతుందని, తద్వారా జరిగే పరువు నష్టాన్ని మళ్లీ పూడ్చలేమంటూ న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 29మార్చి 2019కి వాయిదా వేసింది.