Bhairavam : ‘భైరవం’ మూవీ రివ్యూ.. ముగ్గురు హీరోల కంబ్యాక్ అదిరిందిగా..

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్.. ముగ్గురు కొంచెం గ్యాప్ తో వస్తుండటంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Bhairavam : ‘భైరవం’ మూవీ రివ్యూ.. ముగ్గురు హీరోల కంబ్యాక్ అదిరిందిగా..

Bellamkonda Sreenivas Manchu Manoj Nara Rohith Bhairavam Movie Review

Updated On : May 30, 2025 / 8:58 PM IST

Bhairavam Movie Review : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ముగ్గురు హీరోలతో భారీ మ‌ల్టీస్టార‌ర్ గా తెరకెక్కిన సినిమా ‘భైరవం’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మాణంలో విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది హీరోయిన్స్ గా, జయసుధ కీలక పాత్రలో నటిస్తున్నారు. భైరవం సినిమా నేడు మే 30న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. వరద(నారా రోహిత్), గజపతి(మంచు మనోజ్) చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. శీను(బెల్లంకొండ శ్రీనివాస్) గజపతిని కాపాడడంతో అతను కూడా వీళ్ళ ఫ్రెండ్ అవుతాడు. గజపతి జమీందారు ఫ్యామిలీ అయినా డబ్బు మొత్తం పందాల్లో పోగొడతాడు. వరద, గజపతిలకు శీను నమ్మినబంటులా ఉంటాడు. వరద, గజపతి ఆ ఊరి ఆలయాన్ని, ఆలయ ఆస్తిని కాపాడుకుంటూ వస్తారు. అయితే గుడికి సంబంధించిన ఓ భూమి మీద మినిస్టర్ కన్నుపడుతుంది. ఆ భూమి పట్టా బ్యాంక్ లాకర్ లో ఉంటుంది.

గజపతికి డబ్బు అవసరం ఉందని తెలిసి ఆ పట్టా తెచ్చిస్తే డబ్బులు ఇస్తామంటారు. గజపతి భార్య(ఆనంది) కూడా సంఘంలో పరువు, మర్యాదలు, డబ్బు కావాలంటుంది. దీంతో వరదకు తెలియకుండా ఆ పట్టా మినిస్టర్ కి ఇవ్వాలని గజపతి ప్లాన్ చేసినా ఈ విషయం వరదకు తెలిసిపోతుంది. మరి ఈ విషయం వరదకి తెలిసి ఏం చేస్తాడు? గజపతి నిజంగానే డబ్బుల కోసం ఆలయ పట్టా ఇచ్చేస్తాడా? ఇదంతా తెలిసిన శీను ఏం చేస్తాడు? చిన్నప్పటినుంచి స్నేహితులుగా పెరిగిన ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది? భూమి పట్టా కోసం మినిస్టర్, అతని మనుషులు ఏం చేస్తారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Karate Kid: Legends : ‘కరాటే కిడ్ – లెజెండ్స్’ మూవీ రివ్యూ.. జాకీచాన్ సినిమా ఎలా ఉందంటే..

సినిమా విశ్లేషణ.. ఇది తమిళ సినిమా గరుడన్ కి రీమేక్ గా తెరకెక్కింది. కానీ కేవలం కథ మాత్రమే తీసుకొని కథనం మొత్తం కొత్తగా రాసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్.. ముగ్గురు కొంచెం గ్యాప్ తో వస్తుండటంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్ గా పెరిగిన ఇద్దరు వ్యక్తులు, ఓ గుడి, ఆ గుడికి చెందిన ఆస్తిపై ఒక మినిస్టర్ కన్ను పడటంతో ఫ్రెండ్స్ మధ్య ఎలా విబేధాలు వచ్చాయి అని స్నేహం చుట్టూ రాసుకున్న కమర్షియల్ కథ భైరవం.

ఫస్ట్ హాఫ్ ముగ్గురు హీరోలకు మంచి ఎలివేషన్స్ ఇచ్చి మొదలుపెట్టారు. మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్ లవ్ ట్రాక్ సెట్ అవ్వదు. మినిస్టర్ గుడి పట్టా కోసం గజపతిని కలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ గజపతి వరద మీద వేసే ప్లాన్స్, మధ్యలో శీను ఏం చేస్తాడు అని ప్రతి సీన్ ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మంచి ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్ లతో సాగుతుంటే మధ్యలో లవ్ ట్రాక్, సాంగ్ ని అక్కర్లేకపోయినా ఇరికించారు. కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టిస్తారు. ఆడదాని కోసం యుద్ధాలే జరిగాయి.. రాజ్యాలే పోయాయి.. అనే సామెతకు ఈ సినిమా కరెక్ట్ గా సరిపోతుంది. గజపతి భార్య కోరిన కోరికలే కథ మొత్తాన్ని మలుపు తిప్పుతాయి. అక్కడక్కడా వెన్నెల కిషోర్ తో కామెడీ ట్రై చేసారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. గరుడన్ చూడకుండా భైరవం చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మెప్పిస్తుంది.

bhairavam

నటీనటుల పర్ఫార్మెన్స్.. మంచు మనోజ్ ఆల్మోస్ట్ 8 ఏళ్ళ గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇచ్చి కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో లో సాలిడ్ గా అదరగొట్టాడు. మనోజ్ ఈ పాత్రతో మంచి కంబ్యాక్ ఇచ్చినట్టే. ఎలాగో నెక్స్ట్ మిరాయ్ సినిమాలో విలన్ కాబట్టి భవిష్యత్తులో విలన్ గా సెటిల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. నారా రోహిత్ కూడా ఒక మంచి పాత్రలో యాక్షన్స్ అదరగొడుతూ పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఓ పక్క అమాయకుడిగా కనిపిస్తూనే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. పూనకం వచ్చే సీన్స్ లో బాగా నటించాడు. ముగ్గురికి కెరీర్లో మంచి పాత్రలు పడ్డాయని చెప్పొచ్చు.

గజపతి భార్య పాత్రలో ఆనంది కాస్త నెగిటివ్ షేడ్స్ లో, అసూయ ఉండే మహిళ పాత్రలో న్యాచురల్ గా మెప్పించింది. వరద భార్య పాత్రలో దివ్య పిళ్ళై మంచి ఎమోషన్ ని పండించింది. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మధ్యమధ్యలో వచ్చి కనపడే హీరోయిన్ పాత్ర అయినా పల్లెటూరి అమ్మాయిలా బాగానే మెప్పించింది. డ్యాన్సులతో కూడా అలరించింది. డైరెక్టర్ సందీప్ రాజ్, అజయ్ నెగిటివ్ షేడ్స్ లో మెప్పించారు. జయసుధ, ఇనాయ సుల్తానా.. అక్కడక్కడా కనిపించి పర్వాలేదనిపించారు. సంపత్, టెంపర్ వంశీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Hari Hara VeeraMallu : ‘హరి హర వీరమల్లు’ నిర్మాతకు అస్వ‌స్థ‌త‌.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసారు. ప్రతి ఫైట్ సీక్వెన్స్ గూస్ బంప్స్ ఇస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీచరణ్ పాకాల మొదటిసారి ఒక కమర్షియల్ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ లో BGM బాగున్నా కొన్ని సీన్స్ లో అక్కర్లేకపోయినా హెవీ మ్యూజిక్ ఇచ్చారని అనిపిస్తుంది. రీమేక్ కథ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథనం మార్చుకొని పక్కా కమర్షియల్ సినిమాలా తెరకెక్కించడంలో డైరెక్టర్ విజయ్ కనకమేడల సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా చాలా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘భైరవం’ సినిమా స్నేహితుల మధ్య డబ్బు వల్ల ఎలాంటి విబేధాలు వచ్చాయి అని కమర్షియల్ గా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.