Karate Kid: Legends : ‘కరాటే కిడ్ – లెజెండ్స్’ మూవీ రివ్యూ.. జాకీచాన్ సినిమా ఎలా ఉందంటే..
కరాటే కిడ్ లెజెండ్స్ సినిమా నేడు మే 30న రిలీజ్ అయింది.

Jackie Chan Ben Wang Karate Kid Legends Movie Review
Karate Kid: Legends Movie Review : సూపర్ హిట్ చైనీస్ – అమెరికా ఫ్రాంచైజ్ సినిమా కరాటే కిడ్ నుంచి వచ్చిన ఆరో సినిమా ‘కరాటే కిడ్ – లెజెండ్స్’. కరెన్ రోసెన్ ఫెల్ట్ నిర్మాణంలో జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఇండియాలో సోనీ ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తుంది. జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. కరాటే కిడ్ లెజెండ్స్ సినిమా నేడు మే 30న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. లీ ఫాంగ్(బెన్ వాంగ్) కుంఫు నేర్చుకోవడం అతని తల్లికి ఇష్టం ఉండదు. కుంఫుకు దూరంగా లీ ఫాంగ్ తల్లి(మింగ్ నా వెన్) అతన్ని చైనా నుంచి అమెరికాకు తీసుకెళ్తుంది. అక్కడ న్యూయార్క్ లో లీ ఫాంగ్ కు ఓ పిజ్జా షాప్ ఓనర్ విక్టర్(జాషువా జాక్సన్), అతని కూతురు మియా(సేడీ స్టాన్లీ)తో పరిచయం ఏర్పడుతుంది. మియా మాజీ బాయ్ ఫ్రెండ్ కానర్(అరామిస్ నైట్) మియా, లీ ఫాంగ్ లని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లీ ఫాంగ్ కి కుంఫు వచ్చని విక్టర్ కి తెలియడంతో అతని దగ్గర నేర్చుకొని డబ్బు కోసం పోటీలకు వెళ్లి హాస్పిటల్ పాలవుతాడు.
ఆ ఘటనతో మియా లీ ఫాంగ్ కు దూరమవుతుంది. లీ ఫాంగ్ కి న్యూయార్క్ లో జరిగే 5 బారోస్ అనే కుంఫు కరాటే పోటీలో పాల్గొనాలని ఉంటుంది. అదే సమయంలో చైనా నుంచి లీ ఫాంగ్ గురువు మిస్టర్ హాన్(జాకీ చాన్) వస్తాడు. మిస్టర్ హాన్ ఎందుకు వచ్చాడు? లీ ఫాంగ్ 5 బారోస్ లో 5 సార్లు వరుస ఛాంపియన్ తో ఆడి గెలుస్తాడా? ఆ ఛాంపియన్ ఎవరు? విక్టర్ తన అప్పులు ఎలా తీరుస్తాడు? లీ ఫాంగ్ – మియా ఎలా కలుస్తారు? లీ ఫాంగ్ మళ్ళీ పోటీలకు వెళ్ళడానికి అతని తల్లి ఒప్పుకుంటుందా? అసలు లీ ఫాంగ్, అతని తల్లి చైనా నుంచి ఎందుకు వచ్చేసారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. కరాటే కిడ్ ఫ్రాంచైజ్ లో ప్రతిసారి ఓ వ్యక్తి అతని జీవితం కరాటే, కుంఫు చుట్టూ తిరగడం, వాటిల్లో గెలవడం అని ఇన్‌స్పిరేషనల్ గా చూపిస్తారు. ఈ సినిమా కూడా అంతే. ఒక తల్లి భయంతో తన కొడుకుని కుంఫుకి దూరంగా తీసుకెళ్లినా పరిస్థితులు అతన్ని ఫైటింగ్ కి దగ్గర చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో లీ ఫాంగ్ ఎలా నిలబడి గెలిచాడు అనే కథాంశంతో ఈ కరాటే కిడ్ లెజెండ్స్ తెరకెక్కింది.
చాలా తక్కువ నిడివి ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. కేవలం గంటన్నర మాత్రమే ఈ సినిమా నిడివి. అయితే లీ ఫాంగ్ విక్టర్ కు కుంఫు నేర్పించేంతవరకు సినిమా బాగా సాగదీశారు. హాలీవుడ్ సినిమా నేరేషన్ స్టైల్ అని సరిపెట్టుకోవడమే. విక్టర్ కుంఫు నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. లీ ఫాంగ్ ఎలా ఫైట్ చేస్తాడు? ఎలా గెలుస్తాడు అని ఆసక్తి నెలకొంటుంది. టైటిల్ కి తగ్గట్టు జాకీ చాన్, రాల్ఫ్ మాకియో ఇద్దరు లెజెండ్స్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి లీ ఫాంగ్ ని గెలవడానికి ఎలా తయారుచేస్తారు అని కామెడీగా ఆసక్తిగా ఉంటుంది. క్లైమాక్స్ పోటీ బాగుంటుంది. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్ తమ్ముడు లాంటి సినిమాలు గుర్తుకురావడం ఖాయం. చాలా పాత కథ, రెగ్యులర్ కథనం, రెగ్యులర్ ఎమోషన్ తోనే కరాటే కిడ్ – లెజెండ్స్ ని తెరకెక్కించారు. ఒరిజినల్ సినిమా ఒక గంట 50 నిముషాలు ఉండగా ఇండియన్ వర్షన్ లో ఒక 15 నిముషాలు కట్ చేసినట్టు తెలుస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. మెయిన్ పాత్రలో లో బెన్ వాంగ్ కరాటే, కుంఫులను ప్రదర్శిస్తూనే మంచి ఎమోషన్ పండించాడు. జాకీ చాన్ గురువుగా నేర్పిస్తూనే అక్కడక్కడా తన స్టైల్ లో నవ్వించాడు. రాల్ఫ్ మాకియో గెస్ట్ అప్పీరెన్స్ బాగుంది. సేడీ స్టాన్లీ క్యూట్ గా కనిపించి అలరించింది. జాషువా జాక్సన్, మింగ్ నా వెన్.. మిగిలిన నటీనటులు బాగా నటించారు. అరామిస్ నైట్ నెగిటివ్ షేడ్స్ లో మెప్పించాడు.
Also Read : Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ పండక్కి థియేటర్స్ లో సందడి..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. రెగ్యులర్ కథ, కథనంతోనే డైరెక్టర్ హీరో గెలవాలి అనే ఎమోషన్ ని చక్కగా పండించాడు. ఇక హాలీవుడ్ సినిమా అంటే నిర్మాణ పరంగా బాగా ఖర్చుపెడతారని తెలిసిందే. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
మొత్తంగా ‘కరాటే కిడ్ – లెజెండ్స్’ కుంఫు వద్దనుకుని దూరంగా వెళ్లిన కుర్రాడు ఎలా పోటీల్లో గెలిచాడు అని ఆసక్తిగా చూపించారు.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.