Sai Rajesh : మీరు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అన్నా సరే.. మొత్తం ఆరు లవ్ స్టోరీలు తీయాలని ఫిక్స్ అయ్యాం..
కొత్త సినిమా లాంచ్ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Director Sai Rajesh Comments on Their Love Story Movies
Sai Rajesh : సాయి రాజేష్ ఇటీవల డైరెక్టర్ గా బేబీ సినిమాతో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత SKN తో కలిసి సాయి రాజేష్ ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. యూట్యూబర్ అలేఖ్య హారిక(Alekhya Harika) హీరోయిన్ గా, సంతోష్ శోభన్(Santosh Soban) హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిపి నాగచైతన్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లోనే లిప్ కిస్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రేమ కొటేషన్స్ పెట్టారు. దీంతో ఇది కూడా బేబీ లాగే లవ్ స్టోరీ అని తెలిసిపోతుంది. ఈ సినిమా లాంచ్ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
సాయి రాజేష్ మాట్లాడుతూ.. నేను మంచి లవ్ స్టోరీ ఉంటేనే ప్రొడ్యూస్ చేస్తాను. గతంలో కలర్ ఫోటో సినిమా తీసి సక్సెస్ సాధించాము. నేషనల్ అవార్డు కూడా సాధించాము. బేబీ సినిమాతో నాపై ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడు కూడా లవ్ స్టోరీతోనే రాబోతున్నాము. సోషల్ మీడియాలో నిబ్బా నిబ్బి స్టోరీలు అని నన్ను ట్రోల్ చేసినా సరే మొత్తం మా దగ్గర ఆరు లవ్ స్టోరీలు ఉన్నాయి. నేను, SKN అవి తీయాలని ఫిక్స్ అయ్యాం. అందులో కలర్ ఫోటో, బేబీ సినిమాలు రెండు అయిపోయాయి. ఇటీవల వైష్ణవి, ఆనంద్ తో ఇంకో సినిమా అనౌన్స్ చేశాం. ఇప్పుడు సంతోష్, హారికలతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ నాలుగు కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు కూడా వస్తాయి అని తెలిపాడు.
అలాగే.. ఈ స్టోరీలు సినిమాటిక్ యూనివర్స్ లు కాదు, సీక్వెల్స్ కాదు. నేనేమి లోకేష్ కానగరాజ్ కాదు అని సరదాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో SKN, సాయి రాజేష్ తీసే సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది.