హ్యాపీ బర్త్‌డే కింగ్ నాగార్జున

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..

  • Published By: sekhar ,Published On : August 28, 2019 / 12:32 PM IST
హ్యాపీ బర్త్‌డే కింగ్ నాగార్జున

Updated On : August 28, 2019 / 12:32 PM IST

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..

కింగ్ నాగార్జున ఆగస్టు 29న తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సిక్స్టీలోనూ థర్టీ ప్లస్‌లా కనబడడం అక్కినేని అందగాడికే సాధ్యం అని కొత్తగా చెప్పనవసరం లేదు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మాస్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, ప్రేమకథలు చేసినా.. ఓ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా, ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా.. వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ, నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ అసలు సిసలు అక్కినేని నట వారసుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు చూరగొన్నాడు.

‘గీతాంజలి’ లాంటి విషాదాంత ప్రేమకథతో సంచలనం సృష్టించినా, ‘శివ’గా సైకిల్ చైన్ లాగి ట్రెండ్ సెట్ చేసినా, ‘హలో బ్రదర్‌’గా అలరించినా, ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని చూరగొన్నా, ‘అన్నమయ్య’గా కీర్తనలు ఆలాపించి అవార్డులనందుకున్నా, ‘మన్మథుడు’గా ముద్దుగుమ్మలను మెస్మరైజ్ చేసినా, ‘మాస్’ అంటూ చేతులు మడతపెట్టినా, ‘కింగ్’ అంటూ కాలర్ ఎగరేసినా, ‘శ్రీరామదాసు’గా భక్తిపారవశ్యంలో ముంచెత్తినా, ‘మనం’గా మదిలో నిలిచిపోయినా, ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ సరసాలాడినా, సినిమానే ‘ఊపిరి’గా ప్రయోగాలు చేసినా.. అది ఒకే ఒక్క ‘అక్కినేని నాగార్జున’కు మాత్రమే సాధ్యం తప్ప మరొకరికి కాదు..

తన సినిమాకు తానే న్యాయనిర్ణేత.. సినిమా నచ్చకపోతే చూడొద్దు అంటూ అభిమానులకు మొహమాటం లేకుండా చెప్పే హీరో నాగ్ ఒక్కడే.. ఆయన చేసిన ప్రయోగాలు అనేకం, ఆయన కీర్తి అనంతం.. నాగ్ పరిచయం చేసిన దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమలో చాలామందే ఉన్నారు. వయసు పెరిగినా వన్నె తరగని నిత్య యవ్వనుడు, మన్మథుడు, అభిమానుల కింగ్, అక్కినేని నాగార్జునకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన డైహార్డ్ ఫ్యాన్ అఖిలేష్ చీదెళ్ల డిజైన్ చేసిన కింగ్ బర్త్‌డే DP సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అక్కినేని అభిమానులందరూ తమ ప్రోఫైల్ పిక్‌గా ఇదే DP పెట్టుకున్నారు.