Sathyam Sundaram : ‘సత్యం సుందరం’ రివ్యూ.. పేరు తెలియని వ్యక్తితో రాత్రంతా..

సినిమా మొత్తం సత్యానికి ఆ వ్యక్తి పేరు ఏంటో, అతనెవరో తెలీదు అనే నడిపిస్తారు.

Sathyam Sundaram : ‘సత్యం సుందరం’ రివ్యూ.. పేరు తెలియని వ్యక్తితో రాత్రంతా..

Karthi Arvind Swami Sathyam Sundaram Movie Review and Rating

Updated On : September 28, 2024 / 9:27 AM IST

Sathyam Sundaram Movie Review : కార్తీ, అరవింద స్వామి మెయిన్ లీడ్స్ లో శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిని, జయప్రకాశ్, రాజ్ కిరణ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సత్యం సుందరం’. 96 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతికలు ఈ సినిమాని నిర్మించారు. తమిళ్ లో మెయజగన్ పేరుతో నిన్నే రిలీజ్ అవ్వగా తెలుగులో మాత్రం నేడు సెప్టెంబర్ 28న రిలీజయింది.

కథ విషయానికొస్తే.. సత్యమూర్తి(అరవింద స్వామి) టీనేజీ వయసులో వాళ్ళ బంధువులు మోసం చేసి తమ ఆస్తిపాస్తులు లాక్కోవడంతో వాళ్ళ సొంతూరు అమరావతి వదిలేసి వైజాగ్ షిఫ్ట్ అవుతారు. 20 ఏళ్ళ తర్వాత తన చెల్లి పెళ్ళికి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ దగ్గర్లో ఉన్న ఉద్దండరాయపాలెంలోని పెళ్ళికి హాజరవుతాడు సత్యం. చిన్నప్పుడు తన చేతుల మీదుగా పెరిగిన తన చెల్లిని చూసి, చెల్లి కూడా అన్నని చూసి ఎమోషనల్ అవుతారు.

అయితే ఆ పెళ్ళిలో సత్యమూర్తిని ఓ వ్యక్తి(కార్తీ) బావా అంటూ తగులుకుని వెంటే ఉంటాడు. అతనిపై ఎక్కడలేని ప్రేమని కురిపిస్తాడు. అనుకోకుండా తను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో గత్యంతరం లేక సత్యమూర్తి ఆ వ్యక్తి ఇంటిలో ఆ రాత్రి బస చేయాల్సి వస్తుంది. అయితే తనని బావ అని పిలుస్తూ తననే పట్టుకున్న వ్యక్తి మీద మొదట చిరాకు వేసినా అతని కల్మషం లేని మనసు, అతను చెప్పిన కొన్ని సంఘటనలతో అతనిపై గౌరవం పెరుగుతుంది. కానీ ఆ వ్యక్తి ఎవరో సత్యం కనిపెట్టలేకపోతాడు. దీంతో అతను ఏదో తప్పు చేసినవాడిలా భావించి ఆ వ్యక్తి ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరి ఆ వ్యక్తి ఎవరో సత్యం కనుక్కున్నాడా? అసలు ఆ వ్యక్తికి సత్యానికి సంబంధం ఏంటి? ఆ వ్యక్తి సత్యంపై ఎందుకు అంత ప్రేమ కురిపిస్తున్నాడు? సత్యం 20 ఏళ్ళు ఎందుకు వాళ్ళ సొంతూరికి వెళ్ళలేదు? పెళ్ళిలో జరిగిన సంఘటనలు ఏంటి? ఆ తెలియని వ్యక్తితో ఒక రాత్రంతా సత్యం ఎలాంటి ప్రయాణం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Balakrishna : 50 ఏళ్ళ నట జీవితానికి.. బాలయ్యకు అరుదైన అవార్డు.. కరణ్ జోహార్ చేతుల మీదుగా..

సినిమా విశ్లేషణ.. సినిమా మొత్తం సత్యానికి ఆ వ్యక్తి పేరు ఏంటో, అతనెవరో తెలీదు అనే నడిపిస్తారు. కానీ టైటిల్ సత్యం సుందరం లోనే పేరు ఉంది కాబట్టి ఆడియన్స్ కి అతనే సుందరం అని ముందుగానే తెలిసినా అతనితో సత్యానికి చిన్నప్పుడు ఉన్న రిలేషన్ ఏంటి అని సినిమా చివరి వరకు సాగదీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ ఆ సాగదీయడంలో సాగదీత ఎక్కువైంది. సినిమాలో మొత్తం తెలుగు పేర్లతో డబ్బింగ్ చూపినా, తెలుగు పదాలు చూపించినా పూర్తిగా తమిళ వాసనే వస్తుంది. సినిమా చాలా నిదానంగా సాగుతుంది. సినిమా మొదటి అరగంట వరకు చూడాలంటే చాలా ఓపిక ఉండాలి.

కార్తీ ఎంటర్ అయ్యాక సినిమా పరిగెడుతుంది. ఎప్పుడో వదిలేసిన మనుషులు, ఊరికి ఒక పెళ్లి కోసం వెళ్తే అక్కడ ఎవరో తెలియని ఓ మంచి వ్యక్తి తగులుకుని విపరీతమైన ప్రేమ కురిపిస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండే కథాంశంతో ఈ సినిమాని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. సత్యం, సుందరం ఇద్దరి చిన్నప్పటి కథలని కొంచెం ఎమోషనల్ గా చూపించినా ఒక రాత్రంతా వీరి మధ్య జరిగే సంభాషణలో మంచి హాస్యాన్ని పండించారు. కార్తీ చాలా యాక్టివ్ గా ఫుల్ గా నవ్వించాడు. అయితే ఇలాంటి స్లో నేరేషన్ ఎమోషనల్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే. కానీ సొంతిల్లు, సొంత ఊరు అనే ఎమోషన్ ఉంటే కొంతవరకు కనెక్ట్ అవ్వొచ్చు. కాసేపు చెల్లి సెంటిమెంట్ ని కూడా బాగా పండించారు. సినిమా చివర్లో మాత్రం అంతేనా అయిపోయిందా అనిపించక మానదు.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. కార్తీ అయితే గలగలా మాట్లాడే పాత్రలో తన కామెడీతో అదరగొట్టేసాడు. అరవింద స్వామి సైలెంట్ గా ఉండే వ్యక్తిగా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసారు. శ్రీ దివ్య కార్తీ భార్య పాత్రలో కాసేపే కనిపించి మెప్పించింది. స్వాతి, దేవదర్శిని, జయప్రకాశ్, రాజ్ కిరణ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. ప్రేమ్ కుమార్ గత సినిమా 96 లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అంతే. సినిమా చాలా భాగం రాత్రి పూటే జరుగుతుంది. సినిమాటోగ్రఫీతో విజువల్స్ అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటలు తమిళ్ డబ్బింగ్ కావడంతో అర్ధం కాకపోయినా వినడానికి బాగానే ఉన్నాయి. కథలో కొత్తదనం ఉన్నా కథనంలో మాత్రం చాలా సాగదీత, నిదానం ఉన్నాయి. దర్శకుడిగా ప్రేమ్ కుమార్ మరోసారి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా సూర్య తన తమ్ముడి సినిమాకు బాగానే ఖర్చుపెట్టాడు.

మొత్తంగా సత్యం సుందరం కథ 20 ఏళ్ళ తర్వాత సత్యం చుట్టాల పెళ్ళికి వెళ్తే ఓ తెలియని వ్యక్తి కనపడి విపరీతమైన ప్రేమ కురిపిస్తే వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అనే కథని కామెడీ ఎమోషనల్ గా సాగదీస్తూ చెప్పారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..