హీరోయిన్‌ను ఆట ఆడుకున్న విజయ్ ఫ్యాన్స్.. చిన్మయి సపోర్ట్..

హీరో ఫ్యాన్స్ హీరోయిన్‌ను ట్రోల్ చేయడం, వారి టార్చర్ తట్టుకోలేక ఆ హీరోయిన్ ట్వీట్ డిలీట్ చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. తమిళ స్టార్ హీరో విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్ వంటి భారీ తారాగణంతో, కార్తి ‘ఖైది’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాస్టర్’.
లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ‘మాస్టర్’ యూనిట్ మొత్తం ఒక ఇంట్లో క్వారెంటైన్ అయితే ఎవరెవరు ఏయే పనులు చేస్తుంటారో ఊహిస్తూ ఓ కార్టూన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్.
ఈ కార్టూన్‌లో ఒకరు సంగీతం వింటుంటే మరొకరు స్మార్ట్‌ఫోన్‌తో, ఇద్దరు ల్యాప్‌టాప్‌లతో ఉన్నారు. మాళవికను పోలిన ఓ లేడీ క్యారెక్టర్ మాత్రం వంట చేస్తోంది. ఆ కార్టూన్ చూసిన మాళవిక.. ‘ఊహా చిత్రాల్లో కూడా మేం వంట పనులే చేయాలా?’ అని అసహనం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ఇదే విజయ్ అభిమానులకు కోపం తెప్పించింది. వెంటనే ఆమె మీద బూతులతో ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసభ్య పదజాలంతో ట్వీట్లు చేశారు.
మాళవికకు సింగర్ చిన్మయి అండగా నిలిచింది. ‘ఒక నటి, మహిళ తన అసంతృప్తిని వ్యక్తపరిస్తే ఈ స్థాయిలో దాడి చేస్తారా? లింగ వివక్షను ప్రమోట్ చేస్తున్న ఈ ట్వీట్‌ను ఇన్ని వేల మంది రీ-ట్వీట్ చేస్తారా..’ అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాళవిక తన ట్వీట్‌ను డిలీట్ చేసింది.