Vyooham movie: ఆర్జీవీ వ్యూహానికి.. నారా లోకేశ్ ప్రతి వ్యూహం.. ఇక ఆ సినిమా..
మరోవైపు, వ్యూహం సినిమాను ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫాంలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

RGV - Lokesh
Nara Lokesh: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాపై టీడీపీ నేత నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. వర్మ తనకు ఇష్టం వచ్చినట్లు సినిమా తీశారని లోకేశ్ పేర్కొన్నారు.
జగన్ అంటే ఇష్టమని చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ నచ్చరని ఆర్జీవీ అన్నారని గుర్తుచేశారు. సమాజంలో పేరున్న చంద్రబాబును తప్పుగా చూపించారని చెప్పారు. వ్యూహం సినిమా ట్రైలర్‌లో చూపించిన విధంగానే ఆ సినిమా మొత్తం ఉండొచ్చని చెప్పారు. చంద్రబాబును అప్రతిష్ఠ పాలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
జగన్ లబ్ధిపొందేలా వర్మ చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే కాకుండా తమ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పారు. ఇప్పటికే వర్మ పలు తప్పుడు సినిమాలు తీసి, విడుదల చేశారని అన్నారు. ఈ సినిమాల వల్ల నష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ జగన్ కోసం తీస్తున్నారని చెప్పారు. జగన్ ‘వ్యూహం’ సినిమాను తీయించారని అన్నారు. ఈ సినిమా విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని లోకేశ్ కోరారు. డిసెంబరు 26న ఈ పిటిషన్ విచారణకు రానుంది.
ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫాంలలో నిలిపివేత
మరోవైపు, వ్యూహం సినిమాను ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫాంలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలని సివిల్ కోర్టులో లోకేశ్ పిటిషన్ వేయడంతో దీనిపై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27 కు విచారణ వాయిదా వేసింది.