Sarangadhariya : ‘సారంగదరియా’ మూవీ రివ్యూ.. ఆసక్తికర పాయింట్‌తో ఫాదర్ ఎమోషన్‌తో..
రాజా రవీంద్ర, యశస్విని, మొయిన్, మోహిత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా సారంగదరియా. నేడు జులై 12న సారంగదరియా సినిమా థియేటర్స్ లో రిలీజయింది.

Raja Raveender Sarangadhariya Movie Review and Rating
Sarangadhariya Movie Review : రాజా రవీంద్ర, యశస్విని, మొయిన్, మోహిత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా సారంగదరియా. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, మధు, నీల ప్రియా.. పలువురు ముఖ్య పాత్రల్లో సాయిజా క్రియేషన్స్ బ్యానర్ పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో ఈ సారంగదరియా సినిమా తెరకెక్కింది. నేడు జులై 12న సారంగదరియా సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. కృష్ణకుమార్(రాజా రవీంద్ర) ఒక కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన పెద్ద కొడుకు అర్జున్(మొయిన్) ప్రేమించిన కావ్య చనిపోవడంతో లవ్ ఫెయిల్యూర్ గా తాగి తిరుగుతూ ఉంటాడు. చిన్నకొడుకు సాయి(మోహిత్) అలరిచిల్లరగా తిరుగుతూ ఫాతిమా(మధు) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. పెద్ద కూతురు అనుపమ(యశస్విని) డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. అనుపమని రాజు(శివ చందు)ప్రేమ అంటూ వెంటపడుతూ ఉంటాడు. కానీ అనుపమ ట్రాన్స్ గర్ల్ అని, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిందని తెలుస్తుంది. తమ ఊరి నుంచి దూరంగా వచ్చి ఇన్నాళ్లు అనుపమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా బతుకుతున్న ఆ ఫ్యామిలీ రాజు నాన్న వల్ల నలుగురిలో నవ్వులపాలవుతుంది. దీంతో అనుపమ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అసలు అనుపమ ఎవరు? ఆమె గతం ఏంటి? అనుపమ గోల్ ఏంటి? అర్జున్ లవ్ స్టోరీ ఏంటి? ఇద్దరు కొడుకులు బాధ్యత తెలుసుకుంటారా? అర్జున్ లవర్ ఎలా చనిపోయింది? తన పిల్లలు ఇలా ఉంటే తండ్రి ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.
Also Read : Bharateeyudu 2 : భారతీయుడు 2 రివ్యూ.. సేనాపతి తిరిగొచ్చి ఏం చేశాడు?
సినిమా విశ్లేషణ.. ఒక అబ్బాయి అమ్మాయిగా మారి ట్రాన్స్ గర్ల్ అయితే సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది, అదే తనకి ఫ్యామిలీ అండగా ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ ని ఆసక్తిగా చూపించారు సారంగదరియా సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగానే చూపిస్తూ అక్కడక్కడా ఎమోషన్ ని చూపించారు. ఇంటర్వెల్ కి అనుపమ అమ్మాయి కాదు ట్రాన్స్ గర్ల్ అని తెలిసాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి కలుగుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గానే చూపించారు. అనుపమ కథ, మొయిన్ లవ్ స్టోరీ, అనుపమ గోల్ గురించి ఎమోషనల్ గా చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా మంది ముందే గెస్ చేసేస్తారు. ఫాదర్ ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క అంతర్లీనంగా తల్లి ప్రేమని కూడా చాలా బాగా చూపించారు. అలాగే ప్రేమ విషయంలో కులం గురించి, మతం గురించి మాట్లాడుతూ కొన్ని సన్నివేశాలని చూపించారు. ఇక అమ్మాయే కాదు ట్రాన్స్ గర్ల్ అయినా జీవితంలో ఎదగాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని చూపించారు. ముఖ్యంగా పిల్లలు ఎలా ఉన్నా తల్లితండ్రులు సపోర్ట్ ఉండాలి అనే విషయాన్ని చక్కగా చూపించారు. అయితే ఈ సినిమాకి సారంగదారియా అనే టైటిల్ ఎందుకు పెట్టారో మాత్రం డైరెక్టర్ కే తెలియాలి.
నటీనటుల విషయానికొస్తే.. యశస్విని అనుపమ పాత్రలో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అని చాలా చక్కగా ఎమోషనల్ గా నటించి మెప్పించింది. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిగా మొయిన్ బాగా నటించాడు. మోహాత్, మధు కలిసి ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్విస్తారు. రాజా రవీంద్ర మొదటిసారి ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ తండ్రి పాత్రలో నటించడంతో కొత్తగా అనిపిస్తుంది. అయినా ఆ పాత్రలో పర్వాలేదనిపిస్తారు. తల్లి పాత్రలో నీల ప్రియ మాత్రం చాలా బాగా చేసింది. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు.. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపిస్తాయి.
Also Read : Varalaxmi Sarathkumar Wedding : ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి.. ఫోటోలు వైరల్..!
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు యావరేజ్ అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చారు. ఓ కొత్త కథని, సరికొత్త స్క్రీన్ ప్లేతో చాలా బాగా రాసుకున్నారు. కథ, స్క్రీన్ ప్లేకు తగ్గట్టు ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేసారు. దర్శకుడిగా పద్మారావు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా తమ పిల్లలు ఎలా ఉన్నా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే వాళ్ళు జీవితంలో బాగుంటారు అనే కథని ట్రాన్స్ గర్ల్ పాయింట్ తీసుకొని చక్కగా ఎమోషనల్ గా చెప్పారు. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..