Killer Artiste : ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మూవీ రివ్యూ.. మర్డర్ చేయడం ఒక కళ అంటున్న ఆర్టిస్ట్..

మర్డర్ చేయడం ఒక ఆర్ట్, నేను ఆర్టిస్ట్ అంటూ..

Killer Artiste : ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మూవీ రివ్యూ.. మర్డర్ చేయడం ఒక కళ అంటున్న ఆర్టిస్ట్..

Santhosh Krisheka Kalakeya Prabhakar Killer Artiste Movie Review and Rating Here

Updated On : March 21, 2025 / 9:53 AM IST

Killer Artiste Movie Review : సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘కిల్లర్ ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాణంలో రతన్ రిషి దర్శకత్వంలో తెరకెక్కిన కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా నేడు మార్చ్ 21న థియేట్రికల్ రిలీజ్ అయింది. కాలకేయ ప్రభాకర్, నేహా మాధురి, జబర్దస్త్ వెంకీ, తాగుబోతు రమేష్, భద్రం, బిగ్ బాస్ సోనియా ఆకుల, సత్యం రాజేష్, సుదర్శన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. విక్కీ(సంతోష్)చెల్లి స్వాతి(స్నేహ మాధురి)ని ఇంట్లో విక్కీ లేనప్పుడు ఎవరో రేప్ చేసి తీవ్రంగా గాయపరచడంతో చనిపోతుంది. దీంతో విక్కీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. విక్కీ లవర్ జాను(క్రిషేక పటేల్)తనని మార్చాలని ట్రై చేస్తూ ఉంటుంది. అదే సమయంలో సిటీలో పిచ్చి రవి అనే ఓ సైకో హీరోయిన్ మాస్క్ లు వేసి పలువురు అమ్మాయిలను చంపేస్తున్నాడు, అతన్ని పోలీసులు పట్టుకున్నారు అని వార్తలు వస్తాయి.

విక్కీకి తన ఇంట్లో హీరోయిన్ మాస్క్ కనిపించడంతో ఆ సైకోనే తన చెల్లిని చంపాడు అనుకోని అతన్ని చంపాలని ప్రయత్నిస్తాడు. ఆ సైకో పోలీసుల నుంచి తప్పించుకొని జాను తన ఫ్రెండ్స్ తో బర్త్ డే పార్టీ చేసుకునే ఇంటికి వెళ్తాడు. అంతలోనే తన చెల్లిని చంపింది సైకో కాదని విక్కీకి తెలుస్తుంది. మరి విక్కీ చెల్లిని చంపింది ఎవరు? ఆ సైకో జాను బర్త్ డే పార్టీకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏం చేసాడు? విక్కీ తన చెల్లిని చంపిన వాళ్ళని ఎలా పట్టుకున్నాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Tuk Tuk : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ.. భలే క్యూట్ గా ఉందే సినిమా..

సినిమా విశ్లేషణ.. హీరో చెల్లిని ఎవరో రేప్ చేసి చంపేస్తే హీరో పగ తీర్చుకోవడం అనేది రెగ్యులర్ పాయింట్. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా కూడా అదే కథ. కాకపోతే స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేసారు. ఎవరు చంపారు అనే ట్విస్ట్ చెప్పేదాకా మనం కనిపెట్టలేము.

ఫస్ట్ హాఫ్ విక్కీ, జాను లవ్ స్టోరీ, విక్కీ చెల్లి చనిపోవడం, సైకో గురించి సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ లోనే సైకో చంపలేదు అని చెప్పేయడంతో మరి ఎవరికి చంపారు, అతన్ని హీరో ఎలా కనిపెడతాడు అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సైకో జాను బర్త్ డే పార్టీ కి వెళ్లి అక్కడ చేసే రచ్చ మాత్రం కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఓ పక్క సైకో బర్త్ డే పార్టీలో ఏం చేస్తాడు, హీరో తన చెల్లిని చంపింది ఎవరు అని ఎలా కనిపెడతారు అని టెన్షన్ బాగా బిల్డ్ చేసాడు.

క్లైమాక్స్ లో విలన్ ఇతనే అని సర్ ప్రైజ్ చేసి చివర్లో ఓ మెసేజ్ తో ఎండ్ చేసారు. కాలకేయ ప్రభాకర్ చేసే సైకోయిజం నిజంగా సైకోనే ఏమో అనేలా డిజైన్ చేసారు. సిస్టర్ – బ్రదర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. కథ పాతది అయినా స్క్రీన్ ప్లేలో కొత్తదనం ఉంది. మర్డర్ చేయడం ఒక ఆర్ట్, నేను ఆర్టిస్ట్ అంటూ ప్రభాకర్ తో సైకోయిజంకి ఎలివేషన్స్ ఇవ్వడం కొత్తగా ఉంటుంది.

Killer Artiste

నటీనటుల పర్ఫార్మెన్స్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన సంతోష్ ఈ సినిమాతో హీరోగా మారి చెల్లి చనిపోతే డిప్రెషన్, బాధ, కోపం చూపించే పాత్రలో బాగా మెప్పించాడు. క్రిషేక పటేల్ అందాలు ఆరబోస్తూనే నటనలో పర్వాలేదనిపించింది. చెల్లి పాత్రలో నటించిన స్నేహ మాధురి బాగానే నటించింది. సత్యం రాజేష్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు. కాలకేయ ప్రభాకర్ సైకో పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సుదర్శన్, జబర్దస్త్ వెంకీ అక్కడక్కడా కాస్త నవ్విస్తారు. భద్రం, వినయ్ వర్మ, తనికెళ్ళ భరణి, బిగ్ బాస్ సోనియా.. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపిస్తారు.

Also Read : Ram Gopal Varma : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని సీన్స్ తప్ప చాలా వరకు సినిమా మూడు నాలుగు లొకేషన్స్ లో తీసేసారు సినిమాని. పాత కథని కొత్త కథనంలో ఆసక్తిగా చెప్పాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘కిల్లర్ ఆర్టిస్ట్’ సినిమా తన చెల్లిని రేప్ చేసి చంపేస్తే ఓ అన్న ఏం చేసాడు, వాళ్ళని ఎలా పట్టుకున్నాడు, ఈ క్రమంలో ఓ సైకో ఏం చేసాడు అని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.