Sukriti Veni : తండ్రికి తగ్గ కూతురు.. గుండు కొట్టించుకొని నేషనల్ అవార్డు కొట్టిన సుకుమార్ కూతురు.. ఆ సినిమా కథ ఏంటి? ఎక్కడ చూడాలి?
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు గాంధీ తాత చెట్టు సినిమాకు గాను సుకుమార్ కూతురు సుకృతి వేణికి వచ్చింది.

Sukriti Veni
Sukriti Veni : నేడు 2023 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు గాను 71వ నేషనల్ అవార్డులు ప్రకటించారు. ఈ సారి తెలుగు సినిమాలకు కూడా బాగానే అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు గాంధీ తాత చెట్టు సినిమాకు గాను సుకుమార్ కూతురు సుకృతి వేణికి వచ్చింది. సుకృతి నటించిన మొదటి సినిమా ఇదే. మొదటి సినిమాకే బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు అందుకోవడంతో అంతా ఆమెను అభినందిస్తున్నారు. తండ్రికి తగ్గ కూతురు అని పొగుడుతున్నారు.
సుకుమార్ కూతురు సుకృతి వేణి ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధు రావు నిర్మాణంలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ కి ముందే దేశ విదేశాల్లో ఈ సినిమా పలు అవార్డులు సాధించింది. 2025 జనవరి 24న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. అయితే ఈ సినిమా 2023 లోనే సెన్సార్ అయిపోయింది. అందుకే 2023 సినిమాల లిస్ట్ లో ఈ అవార్డు గెలుచుకుంది.
సుకృతి వేణి నటించిన గాంధీ తాత చెట్టు కథ.. తెలంగాణలోని చెరుకు పండించే రంగంపేట ఊర్లో గాంధీ సిద్ధాంతాలను అనుసరించే రామచంద్రయ్య(ఆనంద్ చక్రపాణి) తన మనవరాలికి కూడా గాంధీ(సుకృతి వేణి) అని పేరు పెట్టి గాంధీ మార్గంలోనే పెంచుతాడు. ఆ ఊరి దగ్గర ఉన్న చక్కర ఫ్యాక్టరీ మూత పడటంతో ఊళ్ళో వాళ్లకు ఏం చేయాలో అర్ధం కాదు. అలాంటి సమయంలో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడతాం, మీ పొలాలు అమ్మేయండి అంటూ సతీష్(రాగ్ మయూర్) వస్తాడు. ఊళ్ళో జనాలు వాళ్ళ కష్టాలు తీరడానికి డబ్బుల కోసం పొలాలు అమ్మడానికి ఒప్పందాలు చేసుకుంటారు. కానీ రామచంద్రయ్య మాత్రం తన పొలం అమ్మను, ఆ పొలంలో గాంధీ జ్ఞాపకార్ధం నాటిన చెట్టుని కొట్టడానికి ఒప్పుకోను అంటాడు. అతని కొడుకు మాత్రం డబ్బుల కోసం పొలం అమ్మేయమని గొడవపెట్టుకోవడంతో ఆ చెట్టు పోతుందేమో అని బాధతో మరణిస్తాడు రామచంద్రయ్య. చనిపోయేముందు తన మనవరాలు గాంధీ దగ్గర ఎలాగైనా చెట్టుని కాపాడాలని మాట తీసుకుంటాడు. మరి ఆ చెట్టుని కాపాడటానికి గాంధీ ఏం చేసింది? ఊళ్ళో కెమికల్ ఫ్యాక్టరీ రాకుండా గాంధీ ఏం చేసింది? అహింస మార్గంలో గాంధీ ఊరందర్నీ ఎలా ఒక్కటి చేసింది అనేదే కథ.
ఈ సినిమా కోసం సుకృతి గుండు కూడా కొట్టించుకొని పెద్ద సాహసం చేసింది. ఎదుగుతున్న ఆడపిల్లలకు జుట్టు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. కానీ సినిమా కోసం, సినిమాలో పాత్ర కోసం సుకృతి రియల్ గా గుండు కొట్టించుకుంది. ఈ విషయంలో సుకృతిని మెచ్చుకోవలసిందే. నాన్నకు లాగే సినిమా అంటే ఇప్పట్నుంచే ఇష్టం ఏర్పడింది. మరి భవిష్యత్తులో సుకృతి హీరోయిన్ అవుతుందా లేక సినీ పరిశ్రమలోనే వేరే విభాగంలోకి వెళ్తుందా చూడాలి.
Also Read : Usurae : ‘ఉసురే’ మూవీ రివ్యూ.. తమిళ్ డబ్బింగ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ, ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే దేశ విదేశాల్లో అనేక అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకు సుకృతి నేషనల్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు గెలుచుకుంది. దీంతో అందరూ ఆమెని అభినందిస్తున్నారు.