Gaddar Awards : గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీలు ఆహ్వానం.. తెలంగాణ గద్దర్ అవార్డులకు ఎలా అప్లై చేయాలంటే..
గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

Entry's Invited for Gaddar Awards from Telangana Government
Gaddar Awards : గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం సినిమాలకు నంది అవార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఈ నంది అవార్డులు ఆగిపోయాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది అవార్డులకు బదులు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దీనికి కమిటీ కూడా వేశారు. ఉగాదికి ఈ అవార్డులు ఇస్తామని కూడా ప్రకటించారు.
తాజాగా ఈ గద్దర్ అవార్డులకు ఎంట్రీలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ అవార్డులకు గాను జీ.ఓ ను నేడు విడుదల చేసారు. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు కూడా ఇవ్వాలని, ఇప్పటికే ప్రముఖ నటులు ఎం. ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2024 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు ఈసారి గద్దర్ అవార్డులు ప్రకటించనున్నారు. అయితే 2014 నుండి 2023 వరకు అప్పటి ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను జారీ చేయకపోవడంతో ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డునివ్వాలని నిర్ణయించారు.
గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబందించిన దరఖాస్తులు ఏ.సి గార్డ్స్ లోని తెలంగాణ చలన చిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ కార్యాలయంలో మార్చ్ 13 నుంచి అందుబాటులో ఉంటాయి. ఆ కార్యాలయంలో సంప్రదించి ఆ దరఖాస్తులు ఫిల్ చేసి ఆ కార్యాలయంలో ఇవ్వాలి.
ఈ గద్దర్ అవార్డులను
*ఫీచర్ ఫిల్మ్స్
*జాతీయ సమైక్యతపై చలన చిత్రం
*బాలల చలన చిత్రం
*పర్యావరణం/హెరిటేజ్/ చరిత్ర లపై చలన చిత్రం
*డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్
*యానిమేషన్ ఫిలిం
*సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్స్
*డాక్యుమెంటరీ ఫిల్మ్స్
*షార్ట్ ఫిల్మ్స్ లతో పాటు
*తెలుగు సినిమాలపై బుక్స్/ విశ్లేషణాత్మక వ్యాసాలు
*ఆర్టిస్టులు/ టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు కేటగిరీలలో ఇవ్వనున్నట్టు ప్రకటించారు.