Siddharth Roy Review : ‘సిద్దార్థ రాయ్’ రివ్యూ.. లాజిక్స్ వర్సెస్ ఎమోషన్స్..

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా 'సిద్దార్థ రాయ్'. ఇవాళ రిలీజైన ఈ చిత్రం రివ్యూ ఏంటి..?

Siddharth Roy Review : ‘సిద్దార్థ రాయ్’ రివ్యూ.. లాజిక్స్ వర్సెస్ ఎమోషన్స్..

Tollywood New movie Deepak Saroj Siddharth Roy review

Siddharth Roy Review : చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతూ ‘సిద్దార్థ రాయ్’ అనే సినిమాతో వచ్చాడు. తన్వి నేగి హీరోయిన్ గా, నందిని, ఆనంద్ భారతి, కళ్యాణి నటరాజన్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సిద్దార్థ రాయ్ నేడు ఫిబ్రవరి 23న థియేటర్స్ లోకి వచ్చింది. సినిమా ముందు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో ఇది అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తుంది అన్నారు. మరి సినిమా ఎలా ఉందంటే..

కథ విషయానికొస్తే.. ఇందు(తన్వి నేగి) అనే అమ్మాయిని వెతుకుతూ ప్రేమ పిచ్చోడిలా సిద్దార్థ రాయ్(దీపక్ సరోజ్) భీభత్సము సృష్టిస్తాడు. దీంతో సిద్దార్థ రాయ్ తండ్రి(ఆనంద్ భారతి) ఫ్రెండ్ అయిన ఓ పోలీసాఫీసర్ అతని గురించి తెలుసుకోడానికి అతని చుట్టూ ఉన్న వారితో మాట్లాడతాడు. ఇలా ప్రతి పాత్ర సిద్దార్థ గురించి ఒక్కో విషయం చెప్తారు. చిన్నప్పట్నుంచి బుక్స్ కి బానిసయి కేవలం లాజిక్స్ తో ఎమోషన్స్ లేని ఒక జీనియస్ లా సిద్దార్థ రాయ్ పెరుగుతాడు. తిండి, నిద్ర, సెక్స్ మాత్రమే మనిషి అవసరాలు, వాటి కోసం బతుకుతున్నాం అంటూ ఎలాంటి ఎమోషన్స్ లేని సిద్దార్థ రాయ్ లైఫ్ లో ఇందు వస్తుంది. అందరికంటే జీనియస్ అనిపించుకునే సిద్దార్థని ఇందు ఓ కాంపిటేషన్ లో ఓడిస్తుంది, ఎమోషన్స్ లేని లైఫ్ వేస్ట్ అంటూ మాట్లాడుతుంది. దీంతో చుట్టుపక్కల వాళ్ళు ఇందుని పొగడటం, సిద్దార్థ ని కామెంట్ చేయడంతో అతనిలో ఈగో అనే ఎమోషన్ మొదలయి తర్వాత తిండి, నిద్ర, సెక్స్ దొరకకపోవడంతో తనలోని ఎమోషన్స్ బయటకి వస్తాయి. ఎమోషన్స్ వచ్చాక సిద్దార్థ రాయ్ ఎలా మారాడు? సిద్దార్థ రాయ్ – ఇందు మధ్య ప్రేమ కథ ఏమైంది? సిద్దార్థ రాయ్ ఎందుకు ప్రేమ పిచ్చోడిలా మారిపోయాడు? ఇందు ఎందుకు అతన్ని వదిలేసింది అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also read : సుందరం మాస్టర్ రివ్యూ.. వైవా హర్ష హీరోగా మొదటి సినిమా మెప్పించాడా?

సినిమా విశ్లేషణ.. సింపుల్ గా సినిమా గురించి చెప్పాలంటే లాజిక్స్ వర్సెస్ ఎమోషన్స్ తో సినిమా నడిపించాడు. ఒక మనిషిలో ఎలాంటి ఎమోషన్స్ లేనప్పుడు ఎలా ఉన్నాడు? ఈగో, కోపం, ప్రేమ.. లాంటి ఎమోషన్స్ వచ్చిన తర్వాత, అవి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటంతో ఆ మనిషి ఏమయ్యాడు అనేది చూపించారు. మొదటి హాఫ్ అంతా సిద్దార్థ రాయ్ గురించి అందరూ క్లాస్ లో పాఠం చెప్పినట్టు చెప్పడమే సరిపోతుంది. ఇంటర్వెల్ కి అతనిలో ఎమోషన్స్ బయటకి వచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కుతూహలం మాత్రం ఏర్పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ మరీ ఎక్కువైపోతే సిద్దార్థ రాయ్ ఏం చేసాడు అన్నట్టు సాగుతుంది. సినిమాలో హీరో తప్ప కనపడిన అందరూ లాజిక్స్, ఎమోషన్స్ గురించి క్లాస్ చెప్తూనే ఉంటారు. దీంతో సినిమా చూసినట్టు కాకుండా క్లాస్ విన్న ఫీలింగ్ వస్తుంది. ట్రైలర్ చూసి ఏదో ఊహించి వెళ్తే మాత్రం కష్టమే.

నటీనటుల విషయానికొస్తే.. దీపక్ సరోజ్ మాత్రం నటన పరంగా అదరగొట్టాడు అనే చెప్పొచ్చు. ఎమోషన్స్ లేని వ్యక్తిలా, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిలా, ప్రేమించిన అమ్మాయి దూరమైన అబ్బాయి పడే బాధతో నటనలో మెప్పించాడు. ఇలాంటి వ్యక్తిని ప్రేమికురాలిగా భరించే పాత్రలో తన్వి నేగి మెప్పించింది. హీరో తల్లి తండ్రులుగా ఆనంద్ భారతి, కళ్యాణి, పోలీసాఫీసర్ గా మ్యాథ్యు వర్గీస్, హీరో మరదలి పాత్రలో నందిని.. మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా చూపించారు. ఒక పాట మాత్రం వినడానికి చాలా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కథ పాతది అయినా దాంట్లో లాజిక్స్, ఎమోషన్స్ అనే అంశాన్ని తీసుకోవడం కొత్తదనం. ఇక కథనం అయితే సాగుతూ ఉంటుంది. దర్శకుడిగా యశస్వి పర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు మాత్రం సినిమాలో బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది. .

మొత్తంగా సిద్దార్థ రాయ్.. ఓ వ్యక్తి జీవితం ఎమోషన్స్ కి ముందు, ఎమోషన్స్ తర్వాత అనే కథాంశంతో తెరకెక్కింది. అర్జున్ రెడ్డికి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.