Tollywood : మేము షూటింగ్స్ బంద్ చేస్తాం అంటే మేము కూడా చేస్తాం.. అటు ఫిలిం ఛాంబర్ ఇటు ఫిలిం ఫెడరేషన్..
నిర్మాతలు వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.

Tollywood
Tollywood : టాలీవుడ్ లో ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికులకు ఏకంగా 30 శాతం వేతనాలు పెంచాలని, లేకపోతే షూటింగ్స్ కి రామని సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు మొదట 15 శాతం పెంచుతామని, తర్వాత విడతల వారీగా పెంచుతామని చెప్పినా వినట్లేదు. అలాగే 2000 లోపు రోజువారీ వేతన ఉన్నవాళ్లకు పెంచుతామని చెప్పినా అందరికి పెంచాల్సిందే అని అంటున్నారు ఫెడరేషన్ నాయకులు.
నిర్మాతలు వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. లేబర్ కమిషన్ వద్దకు కూడా వెళ్లారు. అయినా నిర్మాతలు చెప్పిన వేటికి ఫిలిం ఫెడరేషన్ ఒప్పుకోవట్లేదు. నిన్నటి వరకు 30 శాతం పెంచి ఇచ్చిన వాళ్లకు షూటింగ్స్ కి వెళ్తాము అని చెప్పిన ఫెడరేషన్ నేటి నుంచి పూర్తిగా షూటింగ్స్ బంద్ చేస్తామని ప్రకటించారు. నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేస్తున్నామని ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది.
అయితే ఫిలిం ఫెడరేషన్‌కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేయడంతో ఫెడరేషన్ ఫై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతలంతా నష్టాల్లో ఉండి, సినిమాలు నడవక, థియేటర్స్ కి జనాలు రాక కష్టాల్లో ఉంటే ఇప్పుడు ఇదో సమస్య అయిందని నిర్మాతలంతా పెంపుకి వ్యతిరేకిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్ కు ఎలాంటి హామీలు ఇచ్చినా ఒప్పుకోకపోవడంతో ఫిలిం ఛాంబర్ కూడా ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో టాలీవుడ్ లో షూటింగ్స్ మొత్తానికే నిలిచిపోయాయి.