ఆపరేషన్ లోటస్ స్టార్ట్ : కర్ణాటక రాజకీయాల్లో కలకలం

కర్ణాటక రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదుపుతున్నారని కర్ణాటక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముంబైలోని ఓ హోటల్ లో బీజేపీ నేతలు తమ పార్టీలోకి రావాలని వారితో చర్చలు జరిపినట్లు శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో హార్స్ ట్రేడింగ్ జరుగుతుందని శివకుమార్ అన్నారు. ముగ్గరు ఎమ్మెల్యేలతో ముంబై హోటల్ లో బీజేపీ నేతలు ఏం మాట్లాడారో, వారికి ఎంత డబ్బులు ఆఫర్ చేశారో తమకు తెలుసునని శివకుమార్ అన్నారు.
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో శివకుమార్ ది చాలా కీలక పాత్ర. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ట్రబుల్ షూటర్ గా కూడా పేరుంది. ఆయన ఈ సందర్భంగా సీఎం కుమారస్వామిపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారని కుమారస్వామి ఆరోపించారు. సానుకూలంగా అంటే ఆయనకు తెలిసిన నిజాలు బీజేపీ నేతలకు చెబుతున్నాడని తన అర్థం కాదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న కుట్రల గురించి సీఎంకు అదేవిధంగా మాజీ సీఎం సిద్దరామయ్యకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తెలియజేశారని ఆయన తెలిపారు. వేచి చూద్దాం అనే ధోరణితో సీఎం ఉన్నారని, అదే తాను కనుక సీఎం ప్లేస్ లో ఉండి ఉంటే కేవలం 24 గంటల్లో కుట్రలను బయటపెట్టేవాడినని శివకుమార్ అన్నారు. అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విఫలమే అవుతాయని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు మకర సంక్రాంతి తర్వాత క్రాంతి(విప్లవం) జరుగబోతుందని చెబుతున్నారని, అది అంత సులభం కాదని శివకుమార్ అన్నారు.