Gaganyaan మిషన్ : అంతరిక్షంలోకి పంపే 4 వ్యోమగాముల గుర్తింపు

  • Published By: sreehari ,Published On : January 1, 2020 / 07:28 AM IST
Gaganyaan మిషన్ : అంతరిక్షంలోకి పంపే 4 వ్యోమగాముల గుర్తింపు

Updated On : January 1, 2020 / 7:28 AM IST

2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, (ISRO) మరో రెండు భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.  ప్రతిష్టాత్మకమైన గగన్ యాన్, చంద్రయాన్-3 ప్రాజెక్టులను లాంచ్ చేయబోతోంది. ఈసారి మానవ సహిత ప్రాజెక్టులకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది.

Gaganyaan మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ఆర్బిటల్ వ్యోమనౌకలో భారతీయ వ్యోమగాములను పంపనుంది. అంతరిక్షంలోకి పంపే వ్యోమగాములను నలుగురిని గుర్తించినట్టు ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇండియన్ హ్యుమన్ స్పెస్ క్రాఫ్ట్ ప్రొగ్రామ్‌లో భాగంగా 2022 నాటికి భారతీయ వ్యోమగాములతో కూడిన ఆర్బిల్ స్పేస్ క్రాఫ్ట్‌‌ను కనీసం 7 రోజులు అంతరిక్షానికి పంపించడమే గగన్ యాన్ ప్రయోగం ఉద్దేశమని ఇస్రో తెలిపింది.

ఈ ప్రాజెక్టుపై బెంగళూరులో ఇస్రో చీఫ్ కె. శివన్ మాట్లాడుతూ.. గగన్ యాన్ మిషన్ లో అంతరిక్షంలోకి పంపే నలుగురు వ్యోమగాములను గుర్తించామన్నారు. గగన్ యాన్ ప్రయోగానికి ముందే ఆయా వ్యవస్థలను పరీక్షించాల్సి అవసరం ఉందని, ఈ ఏడాదిలోనే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు శిక్షణ ప్రారంభమవుతుందని అన్నారు. భారతీయ వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన ఈ నలుగురు వ్యోమగాములు జనవరిలో మూడో వారం నుంచి రష్యాలో ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వెళ్లనున్నారు. కానీ, వారి పేర్లను ఇస్రో వెల్లడించలేదు. 

2021లో చంద్రయాన్-3 :
మరోవైపు చంద్రయాన్ ప్రాజెక్టును కొనసాగిస్తామన్నారు. చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రభుత్వ ఆమోదం లభించిందని చెప్పారు. రెండవ అంతరిక్ష నౌకాశ్రయం కోసం భూసేకరణ కూడా ప్రారంభించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది 2021లో చంద్రయాన్-3 లాంచ్ చేయనున్నట్టు చెప్పారు.

చంద్రయాన్-3 ప్రాజెక్టు పనులు సాఫీగా కొనసాగుతున్నాయి. చంద్రయాన్-3 కోసం రష్యాలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. చంద్రయాన్-2 మిషన్ విజయవంతమైందని, కానీ, సెప్టెంబర్ నెలలో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైనప్పటికీ, మంచి పురోగతి సాధించామని ఇస్రో చైర్మన్ తెలిపారు.

2019లో ఇస్రో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. చంద్రునిపై రహాస్యాలను ప్రపంచానికి తెలియజెప్పాలని ఇస్రో చేసిన ప్రయత్నం కలగానే మిగిలిపోయింది. ఆఖరికి నాసా కూడా రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోయింది. చెన్నై టెకీ సాయంతో చంద్రుని ఉపరితలంపై విక్రమ్ శకలాలు పడిన ప్రదేశాన్ని నాసా గుర్తించి ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.