సుక్మాలో తుపాకుల మోత : నలుగురు మావోలు హతం

రాయ్‌పూర్: లోక్ సభ ఎన్నికలు సమయం సమీపిస్తున్న క్రమంలో మావోయిస్టు ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో సుక్మా జిల్లాలోని బీమాపురంలో మంగళవారం అంటే మార్చి 26న సీఆర్పీఎఫ్ జవాన్లకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. కర్కాన్‌గూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మావోయిస్టు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 23న మొత్తం మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.