రైల్వే ట్రాక్ పక్కన 48వేల మురికివాడలను తొలగించండి.. సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీలోని 140 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ల చుట్టూ ఉన్న 48 వేల మురికివాడలను మూడు నెలల్లో తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురికివాడల తొలగింపుపై ఏ కోర్టు స్టే ఇవ్వకూడదని కోర్టు ఆదేశించింది. రైల్వే లైన్ చుట్టూ ఆక్రమణలకు సంబంధించి ఏదైనా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే అది ప్రభావవంతం కాదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో వెల్లడించింది.
ఎంసి మెహతా కేసులో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో 1985 నుంచి ఢిల్లీ పరిసరాల్లో కాలుష్యానికి సంబంధించిన సమస్యలపై సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో 140 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ వెంట మురికివాడల ఆక్రమణలు ఉన్నాయని రైల్వేశాఖ సుప్రీంకోర్టుకు వెల్లడించింది 70 కిలోమీటర్ల మార్గంలో 48వేల మురికివాడలు ఉన్నాయని రైల్వేశాఖ తెలపగా.. రాజకీయ జోక్యం కారణంగా ఆక్రమణలను తొలగించడం సాధ్యం కాలేదని చెప్పింది.
ఈ మురికివాడలను తొలగించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఎన్‌జిటి 2018 అక్టోబర్‌లో ఆదేశించినట్లు రైల్వే తెలిపింది, అయితే రాజకీయ జోక్యం కారణంగా రైల్వే లైన్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించలేదని వారు వెల్లడించారు. రైల్వే సెక్యూరిటీ జోన్‌లో చాలా ఆక్రమణలు ఉన్నాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని రైల్వేశాఖ తెలిపింది.
ఈ క్రమంలో మురికివాడను తొలగించడానికి దశలవారీగా పనులు చేయాలని, రైల్వే సేఫ్టీ జోన్‌లో మొదట ఆక్రమణలను మూడు నెలల్లో తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైల్వే లైన్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించే పనిలో రాజకీయ ఒత్తిడి మరియు జోక్యాన్ని సహించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.