No Mask 500 Fine : మాస్క్‌ లేకపోతే రూ. 500 ఫైన్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

No Mask 500 Fine : మాస్క్‌ లేకపోతే రూ. 500 ఫైన్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

500 Rupees Fine For Not Wearing Mask In Public Places In Chhattisgarh1

Updated On : March 27, 2021 / 9:59 AM IST

500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్‌ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడా ఫైన్ ను రూ.500కు పెంచారు. కొవిడ్ మళ్లీ విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్‌ మాస్క్‌ వాడటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఎపిడెమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897 ప్రకారం.. జరిమానాను రూ.500 వరకు పెంచినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో కొన్ని జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌, రాయ్‌పూర్‌, దర్గ్, బస్తర్‌, రాయ్‌ఘర్‌ జిల్లాల్లో పండగలు, వేడుకలు, సమావేశాల నిర్వహణలో ఆంక్షలు విధించినట్లు వివరించింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2వేల 419 కొత్త కేసులు నమోదు కాగా, గత నాలుగు నెలల్లో ఇదే అత్యధికమని అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3లక్షల 32వేల 113కి చేరింది. ఇప్పటివరకు 3లక్షల 14వేల 769 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 4వేల 026 మంది కరోనాకు బలయ్యారు. మరోవైపు కరోనా తీవ్రత అధికంగా ఉన్న కర్ణాటకలో మాస్క్‌ లేకపోతే రూ. 250 ఫైన్‌ విధించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో మాస్కులేని వారి నుంచి జరిమానా రూపంలో ఏకంగా రూ.4 కోట్లు వసూలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం.