సర్టిఫికెట్ కోసం : 70 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన 73 ఏళ్ల దివ్యాంగ వృద్ధుడు

లాక్‌డౌన్‌తో జీవితాలు తల్లక్రిందులైపోయాయి. బతుకులు భారంగా మారిపోయాయి. చేయటానికి పనిలేక..చేతిలో చిల్లిగవ్వలేక తమిళనాడులోని 73 ఏళ్ల వృద్ధుడు సహాయం కోసం ఏకంగా 70 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన దయనీయ ఘటన చోటుచేసుకుంది.
కరోనా కాలంలో లాక్ డౌన్ లతో చేసుకోవాలనికి పని దొరక్క ఎంతోమంది రోజువారీ కూలీలు కుటుంబాలను పోషించుకోవటానికి అల్లాడిపోతున్నారు. అటువంటి కడు దయనీయ పరిస్థితుల్లో ఓ 73 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ సాయం కోసం ఏకంగా 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
ముదిమి వయస్సులో కూడా పనికోసం అతడు పడుతున్న బాధను చూసిన వారంతా బాధపడ్డారు. కంటతడి పెట్టుకున్నారు. అధికారులు అతని బాధను అర్థం చేసుకున్నారు. అతని పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అతడికి ప్రభుత్వ సాయం అందేలా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.
వివరాల్లోకి వెళితే..తంజావూర్ జిల్లా ఏనానల్లూర్‌కు చెందిన నటేశన్ అనే 73 ఏళ్ల వృద్ధుడు. దివ్యాంగుడు కూడా. ఇంతకాలం వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. భార్యచనిపోయింది. ఓ కొడుకు ఉన్నాడు.కానీ అతనిది కూడా అంతంత మాత్రం సంపాదనే. దీంతో నటేశన్ వ్యవసాయి కూలిగా పనిచేసేవాడు. పనులు లేని సమయంలో కూడా ఏమాత్రం ఖాళీగా కూర్చునేవాడు కాదు. ముగ్గు పిండి అమ్మేవాడు.
కరోనా దెబ్బతో అన్ని ఉపాధి పనులు దెబ్బతినడంతో అతని జీవితం దుర్భరంగా మారిపోయింది. చేయటానికి పనేమీ లేదు. దీంతో తనకు దివ్యాంగుల కోటాలో సహాయం అదించాలని స్థానిక అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అలా తిరుగుతున్న అతన్ని కుంభకోణంలోని వైద్య అధికారి నుంచి సర్టిఫికెట్ తేస్తే నీకు పెన్షన్ వచ్చేలా చేస్తామని చెప్పారు.
కానీ రవాణా సదుపాయం లేదు. దీంతో సైకిల్‌పై బయలుదేరాడు. అలా తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి 11 గంటలకు తంజావూరులోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అలా అంత దూరం కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన 73ఏళ్ల నటేశన్ ను చూసిన అధికారులు వెంటనే స్పందించారు. వెంటనే అతనికి దివ్యాంగుడు అనే ధృవీకరిస్తూ పేపర్ తయారు చేసిన అందించారు. ఆ పేపర్ ను తహశీల్దార్ కార్యాలయంలో ఇవ్వండీ వెంటనే మీకు పెన్షన్ వస్తుందని చెప్పి పంపించారు. దీంతో నటేశన్ కు త్వరలో దివ్వాంగుడి కోటాలో పెన్షన్ వస్తుందని అధికారులు తెలిపారు.
Read Here>>నల్లచిరుత వైరల్ ఫోటో