Police Constable: బాప్ రే..12ఏళ్లలో ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండానే 28లక్షలు జీతం అందుకున్న పోలీస్.. ఎలాగంటే..
2023లో ఈ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. 2011 బ్యాచ్‌కు పే గ్రేడ్ ఎవాల్యుయేషన్ ప్రారంభించగా.. అప్పుడు విషయం బయటపడింది.

Police Constable: ఈరోజుల్లో డ్యూటీ చేసినా జీతం ఇచ్చేది కష్టం. కొన్ని సంస్థల్లో రోజూ డ్యూటీకి వెళ్లినా సాలరీ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అలాంటిది 12 ఏళ్లలో ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండానే ఆ పోలీస్ 28 లక్షలు జీతం అందుకున్నాడు. ఏంటి షాకింగ్ గా ఉంది కదూ. ఆ ఖాకీ బాగోతం తెలిసి పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు సైతం విస్తుపోతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక్కరోజు కూడా డ్యూటీ చేసింది లేదు. అయినప్పటికీ 12 సంవత్సరాలుగా జీతం మాత్రం అందుకుంటూనే ఉన్నాడు. ప్రతి నెల అతడి బ్యాంకు ఖాతాలో శాలరీ పడుతూనే ఉంది. అలా 12 ఏళ్లలో మొత్తంగా రూ.28 లక్షలు జీతంగా పొందగలిగాడు. శాఖాపరమైన నిర్లక్ష్యానికి, వ్యవస్థాగత వైఫల్యానికి ఈ ఘటన అద్దం పడుతోంది.
ఆ కానిస్టేబుల్ 2011లో మధ్యప్రదేశ్ పోలీస్ విభాగానికి సెలెక్ట్ అయ్యాడు. మొదట భోపాల్ పోలీస్ లైన్స్‌లో కానిస్టేబుల్ గా పోస్టింగ్ ఇచ్చారు. చేరిన కొద్దికాలానికే, పోలీస్ శిక్షణ కోసం సాగర్ శిక్షణ కేంద్రానికి పంపారు. కానీ అతడు అక్కడ రిపోర్ట్ చేయలేదు. సైలెంట్ గా విదిషలోని తన ఇంటికి వెళ్లిపోయాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అంకితా ఖతేర్కర్ తెలిపారు.
తన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడమో లేదా సెలవు కోరడమో చేయలేదు. తన సర్వీస్ రికార్డును భోపాల్ పోలీస్ లైన్స్ అధికారులకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాడు. అయితే, వాటిని ధృవీకరించుకోకుండానే అధికారులు ఆమోదించారు. అంతేకాదు శిక్షణ కేంద్రంలో అతను లేకపోవడాన్ని ఎవరూ గుర్తించలేదు.
భోపాల్ పోలీస్ లైన్స్‌లో కూడా ఎవరూ దానిని ప్రశ్నించలేదు. ఇటు పోలీస్ లైన్స్‌లో, అటు సాగర్‌లో శిక్షణా కేంద్రంలో లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ, రికార్డుల్లో మాత్రం పేరు ఉండటంతో విధులకు రాకున్నా 12 ఏళ్లుగా అతడి ఖాతాలో జీతం పడుతూనే ఉంది. ఇలా రూ.28లక్షలు అతడి ఖాతాలో జమ అయ్యాయి. అలా అతను పోలీస్ స్టేషన్ లేదా శిక్షణా కేంద్రంలోకి అడుగు పెట్టకుండానే రూ. 28 లక్షల జీతాన్ని అందుకున్నాడు.
2023లో ఈ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీర్ఘకాలంలో ఒకేచోట పనిచేస్తున్న పోలీసులను బదిలీ చేయడం, 2011 బ్యాచ్ వారికి పే గ్రేడ్ మదింపునకు సంబంధించి జాబితా సిద్ధం చేస్తున్న సమయంలో ఈ కానిస్టేబుల్ వ్యవహారం వెలుగు చూసింది. అధికారులు కానిస్టేబుల్‌ను గుర్తించలేకపోయారు. విభాగంలో ఎవరూ అతని పేరు లేదా ముఖాన్ని గుర్తించలేదు. అంతర్గత విచారణ సమయంలో, అధికారులు కానిస్టేబుల్ గత రికార్డులు, సర్వీస్ రిటర్న్‌లను ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఏమీ దొరకలేదు.
ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు, సర్వీసు విషయాలు ఎక్కడా లేవు. ఒక వ్యక్తి 12 సంవత్సరాలు విధుల్లో ఉండి ఒక్క కేసు కూడా అప్పగించకుండా లేదా ఏదైనా అధికారిక పనిలో పాల్గొనకుండా ఉండటం అసంభవంగా అనిపించింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులకు దిమ్మతిరిగిపోయే నిజం తెలిసింది. ఆ కానిస్టేబుల్ అసలు డ్యూటీకే రావడం లేదనే నిజం తెలిసింది. చివరకు కానిస్టేబుల్‌కు నోటీసులు పంపిన అధికారులు ఆయన నుంచి వివరణ కోరారు.
తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆ కానిస్టేబుల్ చెప్పాడు. ఈ పరిస్థితి వల్లే తాను ఇన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాలేదని, అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేకపోయానని పేర్కొన్నాడు. అతడి వివరణతో సంతృప్తి చెందని ఉన్నతాధికారులు .. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. భోపాల్‌లోని టిటి నగర్ లో పని చేస్తున్న ఎసిపి ఖతేర్కర్‌కు దర్యాఫ్తు బాధ్యతలు అప్పగించారు.
“సంబంధిత కానిస్టేబుల్ 2011లో పోలీసు దళంలో చేరాడు. అతని బ్యాచ్‌లోని మిగిలిన వారితో పాటు శిక్షణ కోసం వెళ్లాల్సి ఉన్నా.. వ్యక్తిగత కారణాలు చూపి విడిగా వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. మిగిలిన వారు శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఆ కానిస్టేబుల్ మాత్రం ఎప్పుడూ రిపోర్ట్ చేయలేదు. అతను ఒంటరిగా వెళ్లినందున, అతని కోసం రిటర్న్ రికార్డు నిర్వహించబడలేదు” అని ఎసిపి ఖతేర్కర్ తెలిపారు.
ఆ సమయంలో పోలీస్ రూల్స్ గురించి తనకు తెలియదని కానిస్టేబుల్ వాదించాడు. అంతేకాదు కమ్యూనికేషన్ లేకపోవడం, ఆరోగ్య సమస్యలను సాకుగా చూపించే ప్రయత్నం చేశాడు. కాగా, ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో కొంత మొత్తాన్ని(1.5 లక్షలు) ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన అతడు.. మిగతాది కూడా ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. మిగిలిన మొత్తాన్ని తన భవిష్యత్తు జీతం నుండి తగ్గింపుల ద్వారా తిరిగి చెల్లించడానికి అతడు అంగీకరించాడట.
అతను ప్రస్తుతం భోపాల్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అంతేకాదు ప్రస్తుతం అతడు నిఘాలో ఉన్నాడని ACP తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. నివేదిక వచ్చిన తర్వాత ఉద్యోగితోపాటు పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు.