Rajya Sabha: మన ఎంపీల ఆస్తులు వేయ్యికోట్లు దాటేశాయి.. రూ.8 వేల కోట్లతో తెలంగాణ ఎంపీలు టాప్.. ADR సంచలన నివేదిక
మొత్తం 226 మంది ఎంపీ(Rajya Sabha)ల అఫిడవిట్లను విశ్లేషించగా, దేశవ్యాప్త ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లుగా తేలింది.
ADR released sensational report stating that our 226 Rajya Sabha MPs assets 26,047 crores
- తెలుగు ఎంపీల ఆస్తులు రూ.10,079కోట్లు.
- పార్థసారథిరెడ్డి దేశంలోనే అత్యంత ధనవంతుడు.
- రాజ్యసభలో 31మంది బిలియనీర్ల గుర్తింపు.
Rajya Sabha: దేశ సర్వోన్నత సభ అయిన రాజ్యసభలో ప్రజాప్రతినిధుల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. మొత్తం రాజ్యసభ(Rajya Sabha) సభ్యుల ఆస్తుల విలువతో పోల్చితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల ఆస్తుల వాటా అత్యధికంగా ఉండటం గమనార్హం. సభలోని మొత్తం 226 మంది ఎంపీల అఫిడవిట్లను విశ్లేషించగా, దేశవ్యాప్త ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లుగా తేలింది. ఇందులో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీల ఆస్తుల వాటానే ఏకంగా రూ.10,079 కోట్లు ఉండటం విశేషం.
రాష్ట్రాల వారీగా, పార్టీల వారీగా చూస్తే, రాజ్యసభలో తెలంగాణ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,130 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆస్తుల విలువ రూ.1,949 కోట్లుగా ఉంది. పార్టీల పరంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీల వాటా రూ.8,181 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్ ఎంపీల వాటా రూ.5,524 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం, బీఆర్ఎస్ ఎంపీ అయిన బండి పార్థసారథిరెడ్డి రూ.5,300 కోట్ల అపరిమిత ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ ఎంపీగా అగ్రస్థానంలో నిలిచారు.
రాజ్యసభలో సగటున ఒక్కో ఎంపీ ఆస్తి విలువ రూ.115.25 కోట్లుగా లెక్కతేలింది. అయితే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీల సగటు ఆస్తి మాత్రం అత్యధికంగా రూ.1841.39 కోట్లుగా ఉంది. మొత్తం సభలో 31 మంది బిలియనీర్లు (వంద కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నవారు) ఉండగా, అందులో 9 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు, నలుగురు తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. చట్టసభల్లో పెరిగిపోతున్న ధనబలానికి ఈ ఏడీఆర్ నివేదిక ఒక స్పష్టమైన అద్దం పడుతోంది.
