ఆర్టికల్ 370రద్దు..ఆ ప్రేమ జంటను కలిపింది

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఓ ప్రేమజంటను కలిపింది. ఇన్నాళ్లూ తమ పెళ్లికి అడ్డు వచ్చిన ఆర్టికల్ 370 రద్దు అవడంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లో శ్రీగంగానగర్‌కు చెందిన అక్షయ్ కుక్కడ్ రెండేళ్ల క్రితం ఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేవాడు. అదే సమయంలో.. జమ్మూకు చెందిన కామిని రాజ్‌పుత్ ఢిల్లీలో అక్షయ్ నివాసం ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే ఉండే తన అత్త ఇంటికి వచ్చేది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి… ప్రేమ చిగురించింది. వారిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నా ఆర్టికల్ 370 అంశం అడ్డు వచ్చింది. అక్షయ్ ని పెళ్లి చేసుకుంటే తమ కూతురు కశ్మీర్ పౌరసత్వం కోల్పోతుందని యువతి తల్లిదండ్రులు వెనుకాడారు.
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో వారి పెళ్లికి మార్గం సుగమమైంది. ఇద్దరికి పెద్దలు పెళ్లి చేశారు. దీంతో ఇరువురి కుటుంబాల్లో సంతోషకర వాతావరణం నెలకొంది. పెళ్లి చేసుకున్న అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం కోసం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అక్షయ్, కామిని వెళ్లారు. కానీ.. వారు వెళ్లిన రోజు సెలవు కావడంతో తిరిగి వచ్చారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త దంపతులు స్వాగతించారు.