కొత్త రకం కరోనా టెన్షన్ : బ్రిటన్ నుంచి 246మందితో ఢిల్లీలో ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండ్

Air India Flight యూకేలో తొలిసారిగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను భయపెడుతున్న సమయంలో ఇవాళ యూకే నుంచి 246మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో గత నెల 23 భారత్-యూకే మధ్య రద్దైన విమానాలు.. వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గకముందే ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి.
భారత్ నుంచి యూకేకు విమానాలను ఈ నెల 6న ప్రారంభించగా, ఇవాళ యూకే నుంచి భారత్‌కు విమానాల రాక మొదలైంది. ఈ నెల 6న ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి ఒకటి రెండు ఎయిర్ ఇండియా విమానాలు లండన్‌కు వెళ్లాయి. ఇవాళ 246 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం యూకే నుంచి భారత్‌కు బయలుదేరింది. కాగా,దేశంలో ఇప్పటికే 73మందికి కొత్తరకం కరోనా సోకిన విషయం తెలిసిందే. వీరందరూ బ్రిటన్ నుంచి దేశానికి వచ్చినవాళ్లే.
కాగా, భారత్-యూకే మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ విమానాల ఫ్రీక్వెన్సీ మాత్రం మునుపటిలా ఉండదని, మొత్తం 70 విమానాలకుగాను జనవరి 23 దాకా 30 సర్వీసులు మాత్రమే రాకపోకలు సాగిస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి ఇప్పటికే ప్రకటించారు. ఆ 30 విమానాల్లో 15 భారత్‌కు చెందినవి, 15 యూకేకు చెందినవి ఉంటాయని తెలిపారు.
మరోవైపు,ఇవాళ ఎయిరిండియా విమానంలో యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులకు..ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు కీలక సూచనలు చేశారు. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు కనీసం 10 గంటల గ్యాప్ తీసుకున్న తర్వాతనే ..తమ ప్రాంతాలకు లేదా సిటీలకు కనెక్టింగ్ విమానాల ద్వారా వెళ్లాలని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సూచించింది.