CM MK Stalin: అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు.. సీఎం సంచలన నిర్ణయం.. సీబీఐకి అప్పగింత..

అజిత్ చావుకి పోలీసులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలో అజిత్ ను చిత్రహింసలు పెట్టారని, బాగా కొట్టారని, దాంతో అజిత్ చనిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యారు.

CM MK Stalin: అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు.. సీఎం సంచలన నిర్ణయం.. సీబీఐకి అప్పగింత..

Updated On : July 2, 2025 / 1:11 AM IST

CM MK Stalin: తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలో అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. పారదర్శకంగా, విశ్వసనీయంగా దర్యాప్తు జరిగేలా చూసేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న CB-CID దర్యాప్తు కొనసాగించవచ్చని మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ అన్నారు. CBI విచారణ మరింత స్పష్టతను ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “పారదర్శకత, సమగ్ర దర్యాప్తు కోసం కేసును CBIకి బదిలీ చేయాలని ఆదేశించాను” అని స్టాలిన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు.

స్టాలిన్ స్వయంగా అజిత్ కుమార్ కుటుంబంతో మాట్లాడారు. అజిత్ సోదరుడు నవీన్ కుమార్‌కు ఫోన్ చేశారు. పోలీస్ కస్టడీలో అజిత్ మరణించడం పట్ల స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. అజిత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని చెప్పారు. “క్షమించండి అమ్మా,” అని అజిత్ తల్లి మాలతికి తన సంతాపాన్ని తెలియజేశారు ముఖ్యమంత్రి స్టాలిన్.

మృతుడు అజిత్ కుమార్(27) మాదపురం కాళీఅమ్మన్ ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తాడు. ఆ ఆలయంలోని ఆభరణాల దొంగతనం కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అజిత్ చనిపోయాడు. అజిత్ మృతికి పోలీసులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో అజిత్ ను చిత్రహింసలు పెట్టారని, బాగా కొట్టారని, దాంతో అజిత్ చనిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యారు. కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వలేదని విలపించారు. అజిత్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, వారి దెబ్బలు తాళలేకనే అజిత్ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.

అజిత్ కస్టోడియల్ డెత్ కేసు సంచలనం రేపింది. విచారణ పేరుతో అజిత్ ను పోలీసులు కర్రలు, రాడ్లతో దారుణంగా కొడుతున్న వీడియో బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం పెను దుమారమే రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. శివగంగై ఎస్పీపై చర్యలు తీసుకుంది. బాధ్యతల నుంచి తప్పించింది. రామంతపురం ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.

కస్టోడియల్ డెత్ పై ప్రభుత్వం తొలుత సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించింది. కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా, న్యాయవాది హెన్రీ టిఫాగ్నే అజిత్ కుమార్‌ను ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్‌లతో కొట్టారని చూపించే వీడియో, ఫోటోగ్రాఫిక్ ఆధారాలను సమర్పించారు.

కస్టోడియల్ డెత్ కేసులో ఐదుగురు పోలీసులు అరెస్ట్ అయ్యారు. పోస్టుమార్టం ఆధారంగా ఆరుగురు పోలీసు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కేసుని క్రిమినల్ కేసుగా మార్చారు. ఈ కేసు న్యాయ విచారణ కోసం పంపబడింది.

పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు తెలిశాయి. అజిత్ తల, ఛాతిపై అనేక చోట్ల గాయాలు ఉన్నట్లు రిపోర్టులో ఉంది. అజిత్ కస్టోడియల్ మరణం అట్టుడికేలా చేసింది. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు న్యాయం కోసం రోడ్డెక్కారు. అజిత్ మృతికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసుకి సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వైఖరిపై తీవ్రంగా మండిపడింది. మీ ప్రజలను మీరే చంపుకుంటారా అని సీరియస్ అయ్యింది. దీనిపై అదనపు జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని, జూలై 8కి నివేదిక సమర్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రత్యక్ష సాక్షికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది.

Also Read: భారత స్టార్ క్రికెటర్ కు కోర్టు బిగ్ షాక్.. ప్రతి నెల రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశం..