ఈశాన్య రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన రద్దు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు హోంశాఖ వర్గాలు తెలిపాయి. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘలాయ, అరుణాచల్ ప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం ఆదివారం, సోమవారం నాడు అమిత్ షా పర్యటించాల్సి ఉంది. అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పౌరసత్వ బిల్లు 2019పై నిరసనల జ్వాల రగులుతోంది.
ఈ పరిస్థితుల్లో అమిత్ షా పర్యటనను రద్దు చేయాల్సి వచ్చిందని మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఆదివారం రోజున షిల్లాంగ్ సమీపంలోని ఈశాన్య పోలీసు అకాడమీలో నిర్వహించే పరేడ్ లో అమిత్ షా పాల్గొననున్నారు. మరుసటి రోజు సోమవారం నాడు తవాంగ్ లోని ఓ పండుగ కార్యక్రమంలో షా పాల్గొనాల్సి ఉంది. అసోంలో ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అసోంలో కొనసాగుతున్న ఆందోళనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం ఇద్దరు మృతిచెందారు. పార్లమెంటులో పౌరసత్వ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అసోంలో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గత రెండు రోజులుగా షిల్లాంగ్ లో ఆందోళనకారులు షాపులను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పు అంటించారు.