Cheetah Dies : మరో చీతా మృతి.. 40రోజుల వ్యవధిలో మూడో మరణం, ఎలా చనిపోయిందంటే..
Cheetah Dies : ప్రాజెక్ట్ చీతా కింది ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి. 40 రోజుల్లో వ్యవధిలో మూడు చీతాలు చనిపోవడం విషాదం నింపింది.

Cheetah Dies
Cheetah Dies : మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృతి చెందింది. రెండు రోజుల క్రితం మగ చీతాల దాడిలో ఆడ చీతా గాయపడింది. గాయం తీవ్ర కావడంతో ఆడ చీతా దక్ష ప్రాణాలు విడిచింది. 40 రోజుల వ్యవధిలో మూడు చీతాలు మరణించాయి. దక్ష మృతిని కునో నేషనల్ పార్క్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ప్రాజెక్ట్ చీతా కింది ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను, 2023 ఫిబ్రవరి 17న సౌతాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి.
మొదటి విడతలో గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను భారత్ కు తీసుకురాగా, వాటిలో సాశా అనే ఆడ చీతా అనారోగ్యంతో 2023 మార్చి 27న చనిపోయింది. భారత్ కు తీసుకురావడానికి ముందు నుంచే సాశా అనారోగ్యంతో బాధపడుతోంది. బాగా బలహీనంగా తయారైంది. వెంటనే సిబ్బంది ఆ చీతాను క్వారంటైన్ ఎన్ క్లోజర్ కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే.. సాశా మరణించింది.
రెండో విడతలో భాగంగా 2023 ఫిబ్రవరి 17న 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకురాగా, వాటిలో ఉదయ్ అనే మగ చీతా ఏప్రిల్ నెలలో మృత్యువాత పడింది. ఉదయ్ కూడా అనారోగ్యంతోనే చనిపోయింది. ట్రీట్ మెంట్ పొందుతూ ప్రాణాలు వదిలింది.
తొలి విడతలో నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒక చీతా మార్చి 29న 4కూనలకు జన్మనిచ్చింది. ప్రధాని మోదీ అభ్యర్థన మేరకు ప్రజలు సూచించిన దేశీయ పేర్లను ఈ చీతాలకు పెట్టారు. వీటిలో కవల చీతాలైన ఎల్టర్, ప్రెట్టీలకు గౌరవ్, శౌర్య అని పేర్లు మార్చగా.. నాలుగు కూనలకు జన్మనిచ్చిన చీతాకు జ్వాలాగా పేరు మార్చారు.